విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లలో స్విగ్గీ నుంచీ ఆహారం అందుకోవచ్చు

భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 23 Feb 2024 03:06 IST

దిల్లీ: భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత ఈ సదుపాయాన్ని 4 రైల్వే స్టేషన్లలో (బెంగళూరు, భువనేశ్వర్‌, విజయవాడ, విశాఖపట్నం) ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.  ఇ-క్యాటరింగ్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.


ఇఫ్కోకు ప్రపంచంలోనే అగ్రస్థానం

దిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార (కో-ఆపరేటివ్‌) సంస్థల్లో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో)కు మళ్లీ అగ్రస్థానం లభించింది. తద్వారా గతేడాది లభించిన గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లయ్యింది. స్థూల దేశీయోత్పత్తి, సంస్థ టర్నోవరు మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను ఇస్తారు. ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ అలయన్స్‌ (ఐసీఏ) రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. టర్నోవరు పరంగా ఇఫ్కో స్థానం గత ఆర్థిక సంవత్సరంలోని 97వ స్థానం నుంచి 72కు మెరుగయ్యింది. ‘ఇఫ్కోకు, దేశీయ సహకార ఉద్యమానికి ఇది గర్వించదగ్గ పరిణామం. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామ’ని ఇఫ్కో ఎండీ ఉదయ్‌ శంకర్‌ అవస్థి తెలిపారు.


మారుత్‌ డ్రోన్స్‌కు ‘యుటిలిటీ పేటెంట్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి మారుత్‌ డ్రోన్స్‌ అభివృద్ధి చేసిన మల్టీ-నాజల్‌ సీడ్‌ డిస్పెన్సింగ్‌ డివైజ్‌ డ్రోన్‌కు ‘యుటిలిటీ పేటెంట్‌’ లభించింది. ప్రపంచంలోనే ఇటువంటి పేటెంట్‌ తొలిసారిగా లభించిందని, వచ్చే 20 ఏళ్ల పాటు ఈ పేటెంట్‌ అమల్లో ఉంటుందని సంస్థ తెలిపింది. వరి సాగులో ఉపయోగపడే ఈ డ్రోన్‌ను రైతులకు విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుత్‌ డ్రోన్స్‌ పేర్కొంది. డైరెక్ట్‌ సీడింగ్‌ రైస్‌ పద్ధతిలో వరిసాగుకు వీటిని వినియోగిస్తారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశంలో వరి సాగు రూపురేఖలు గణనీయంగా మారుతాయని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ వివరించారు.  


బైక్‌ బుకింగ్‌ సేవల్లోకి ఉబర్‌!

బెంగళూరు: క్యాబ్‌ బుకింగ్‌ సంస్థ ఉబర్‌, ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)తో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఫలితంగా ఉబర్‌ యాప్‌పై వినియోగదారులకు విస్తృత శ్రేణిలో సేవలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఓఎన్‌డీసీని ప్రభుత్వానికి చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నిర్వహిస్తోంది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఉబర్‌ గ్లోబల్‌ సీఈఓ దారా ఖోస్రోవ్సీ, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకనీ పాల్గొన్నారు. దేశీయంగా తక్కువ ఛార్జీతో ప్రయాణించేందుకు ఉపయోగ పడుతున్న బైక్‌ ట్యాక్సీల బుకింగ్‌ సేవల్లోకి ప్రవేశిస్తామని ఉబర్‌ సీఈఓ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని