తీర్థయాత్రలతో 2 లక్షల మందికి ఉపాధి

పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్నందున, వచ్చే 4-5 ఏళ్లలో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్‌ సేవల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈఓ సచిన్‌ అలుగ్‌ వెల్లడించారు.

Updated : 23 Feb 2024 05:29 IST

ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈఓ సచిన్‌ 

ముంబయి: పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్నందున, వచ్చే 4-5 ఏళ్లలో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్‌ సేవల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈఓ సచిన్‌ అలుగ్‌ వెల్లడించారు. దేశీయంగా తీర్థయాత్రలు వృద్ధి చెందుతున్నాయని, 2023-30 మధ్య ఇవి 16 శాతానికి పైగా వార్షిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయ పర్యాటకంలో 60% వాటా, విభిన్న మతస్థుల పుణ్యక్షేత్రాలకు జరుగుతున్న తీర్థయాత్రలే దక్కించుకోవచ్చని తెలిపారు. 2028 నాటికి ఈ విభాగ ఆదాయమే 60 బిలియన్‌ డాలర్ల (రూ.5 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా వేశారు. ఈ పర్యాటకంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ విభాగం నుంచే తాత్కాలిక, శాశ్వత పద్ధతిలో ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించొచ్చని సచిన్‌ వెల్లడించారు. పరిశ్రమ గణాంకాల ప్రకారం, కొవిడ్‌ తర్వాత తీర్థ యాత్రలు బాగా పెరిగాయి. 2021-22లో విరాళాలు 14% పెరిగాయి. అయోధ్యలో ఇటీవల రామ మందిరం ప్రారంభించిన తర్వాత మతపర పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తోందని సచిన్‌ వివరించారు. ఈ ఒక్క ఆలయం ఫలితంగా కొత్తగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందన్నది వివరించారు.

 పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022లో 14.39 కోట్ల మంది మతపర పర్యటనలకు వెళ్లారు. వీరిద్వారా రూ.1.34 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా ల్లోని చిన్న పట్టణాలు, మెట్రోయేతర నగరాలకూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని