రూ.1,060 కోట్లు సమీకరించిన స్పైస్‌జెట్‌

ప్రిఫరెన్షియల్‌ పద్ధతి ద్వారా ఇప్పటివరకు సమీకరించిన మొత్తం రూ.1,060 కోట్లకు చేరిందని విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ పేర్కొంది.

Published : 23 Feb 2024 03:11 IST

ముంబయి: ప్రిఫరెన్షియల్‌ పద్ధతి ద్వారా ఇప్పటివరకు సమీకరించిన మొత్తం రూ.1,060 కోట్లకు చేరిందని విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ పేర్కొంది. సెక్యూరిటీల జారీ ద్వారా రూ.2,250 కోట్ల తాజా మూలధనాన్ని సమీకరించనున్నట్లు డిసెంబరు 12న స్పైస్‌జెట్‌ వెల్లడించింది. అందులో మొదటి విడత కింద గత నెలలో రూ.744 కోట్లు సమీకరించింది. మరో రూ.316 కోట్లు సమీకరించినట్లు గురువారం వెల్లడించింది. దీంతో సమీకరించిన మొత్తం రూ.1,060 కోట్లు అయ్యింది. ఎరియస్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ లిమిటెడ్‌ సహా ఇద్దరు మదుపర్లకు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 4.01 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి, స్పైస్‌జెట్‌ డైరెక్టర్ల బోర్డుకు చెందిన ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ కమిటీ 2024 ఫిబ్రవరి 21న ఆమోదం తెలిపింది. ఎలారా ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ సహా మరో నలుగురు మదుపర్లకు 2.31 కోట్ల వారెంట్లు జారీ చేసేందుకూ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. ‘స్పైస్‌జెట్‌ వృద్ధి అవకాశాలపై మదుపర్లలో విశ్వాసానికి నిధుల సమీకరణ నిదర్శనం. భవిష్యత్తులో మా ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంద’ని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు అజయ్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని