బిర్లా ఓపస్‌ రంగులు

బిర్లా ఓపస్‌ బ్రాండ్‌పై అలంకరణ రంగుల (డెకరేటివ్‌ పెయింట్స్‌) వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ అడుగుపెట్టింది. మూడేళ్లలో ఈ విభాగం నుంచి రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా వెల్లడించారు.

Updated : 23 Feb 2024 05:29 IST

మార్చి తొలి వారంలో విపణిలోకి
ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా

పానిపట్‌: బిర్లా ఓపస్‌ బ్రాండ్‌పై అలంకరణ రంగుల (డెకరేటివ్‌ పెయింట్స్‌) వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ అడుగుపెట్టింది. మూడేళ్లలో ఈ విభాగం నుంచి రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అదే సమయానికి ఈ వ్యాపారంలో లాభదాయకత సాధించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పానిపట్‌ (హరియాణా), లుధియానా (పంజాబ్‌), చెయ్యార్‌ (తమిళనాడు)లలోని మూడు ప్లాంట్లలో ఈ రంగుల తయారీ కార్యకలాపాలకు గురువారం శ్రీకారం చుట్టారు. మార్చి తొలి వారంలో బిర్లా ఓపస్‌ రంగులు విపణిలోకి విడుదలవుతాయని కంపెనీ తెలిపింది. 2025 నాటికి దేశంలో 6 డెకరేటివ్‌ పెయింట్స్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని బిర్లా గ్రూప్‌ ప్రధాన సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ గత ఏడాది ప్రకటించింది. హరియాణా, పంజాబ్‌, తమిళనాడుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో 1,332 మిలియన్‌ లీటర్ల వార్షిక సామర్థ్యం (ఎంఎల్‌పీఏ)తో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఛామరాజనగర్‌ (కర్ణాటక), మహాద్‌ (మహారాష్ట్ర), ఖరగ్‌పుర్‌ (పశ్చిమ బెంగాల్‌) యూనిట్లలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రంగుల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు.

  • ఆదిత్య బిర్లా గ్రూప్‌ ‘నోవెల్‌ జువెల్స్‌’ పేరిట వచ్చే జులై నుంచి ఆభరణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని