ఆఖర్లో కొనుగోళ్ల దూకుడు

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో మదుపర్ల కొనుగోళ్లతో గురువారం సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఐటీ, టెక్నాలజీ, వాహన షేర్లు రాణించడంతో నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠానికి చేరింది.

Published : 23 Feb 2024 03:15 IST

సమీక్ష

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో మదుపర్ల కొనుగోళ్లతో గురువారం సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఐటీ, టెక్నాలజీ, వాహన షేర్లు రాణించడంతో నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 82.85 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

 • సెన్సెక్స్‌ ఉదయం 72,677.51 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఒకదశలో 72,081.36 పాయింట్ల వద్ద  కనిష్ఠానికి పడిపోయింది. ఆఖర్లో మళ్లీ కోలుకున్న సెన్సెక్స్‌, 73,256.39 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 535.15 పాయింట్ల లాభంతో 73,158.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.40 పాయింట్లు రాణించి 22,217.45 దగ్గర స్థిరపడింది.
 • అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2024-25 సీజన్‌లో, చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో చక్కెర కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రానా షుగర్స్‌, మవానా షుగర్స్‌, శ్రీ రేణుక షుగర్స్‌, దాల్మియా భారత్‌ షుగర్‌, ఈఐడీ ప్యారీ షేర్లు 3% వరకు నష్టపోయాయి. 
 • జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు జోరు కొనసాగుతోంది. గురువారం 4.52% లాభపడిన షేరు    రూ.303.05 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో షేరు 26% లాభపడింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 పరుగులు తీశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.12%, ఐటీసీ 2.73%, ఎం అండ్‌ ఎం   2.61%, టీసీఎస్‌ 2.44%, టెక్‌ మహీంద్రా 2.32%, ఎల్‌ అండ్‌ టీ 2.05%, విప్రో 1.94%, మారుతీ 1.79%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.52%, ఇన్ఫోసిస్‌ 1.46% లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ 1.87% వరకు నష్టపోయాయి.
 • నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 27న వొడాఫోన్‌ ఐడియా బోర్డు సమావేశం కానుంది. దీంతో షేరు 6.27% (96 పైసలు) పెరిగి రూ.16.28 వద్ద ముగిసింది.
 • రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,750 కోట్ల సమీకరణకు సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డు తేదీగా ఫిబ్రవరి 27ను, ఒక్కో షేరు ధరను   రూ.22గా నిర్ణయించింది. రైట్స్‌ ఇష్యూ మార్చి 6న ప్రారంభమై 20న ముగియనుంది.
 • విద్యుత్తు వాహన ఛార్జర్‌ల తయారీ సంస్థ ఎక్సికామ్‌ టెలీసిస్టమ్స్‌ ఐపీఓ ఈనెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.135-142ను నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 100 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌ ఐపీఓ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. ఇష్యూ యూనిట్‌ ధరను రూ.98-100గా నిర్ణయించారు. మార్చి 1న ఇష్యూ ముగియనుంది.
 • కొంత మంది పెట్టుబడిదార్లు ఏర్పాటు చేస్తున్న అసాధారణ వాటాదార్ల సమావేశానికి (ఈజీఎం) కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రవీంద్రన్‌ బైజూ, ఇతర బోర్డు సభ్యులు హాజరుకావడం లేదని బైజూస్‌ వెల్లడించింది. నిర్వహణ లోపాలు, వైఫల్యాల ఆరోపణలతో బైజూ రవీంద్రన్‌, ఆయన కుటుంబ సభ్యులను బాధ్యతల నుంచి తొలగించే అజెండాతో శుక్రవారం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈజీఎం చెల్లదని బైజూస్‌ పేర్కొంది. 
 • బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా యురేకా ఫోర్బ్స్‌లో 10 శాతం వాటాను రూ.979 కోట్లకు ప్రమోటర్‌ సంస్థ లునోలక్స్‌ విక్రయించింది.
 • నమ్‌కీన్‌, యెల్లో డైమండ్‌ చిప్స్‌ తయారు చేసే ఇండోర్‌ సంస్థ ప్రతాప్‌ స్నాక్స్‌లో 47% వాటా కొనుగోలు చేసే యోచనలో ఐటీసీ ఉన్నట్లు తెలుస్తోంది. 
 • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్లు ధీరజ్‌ వద్వాన్‌, కపిల్‌ వద్వాన్‌లకు చెందిన షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ హోల్డింగ్స్‌, బ్యాంక్‌ ఖాతాలను అటాచ్‌ చేయాల్సిందిగా సెబీ ఆదేశించింది. గతేడాది జులైలో సెబీ విధించిన జరిమానా చెల్లించకపోవడంతో.. రూ.22 లక్షల బకాయిలు వసూలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
 • ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌ ప్లాంట్‌లో 30 లక్షల వాహనాల ఉత్పత్తి మైలురాయిని సాధించినట్లు అశోక్‌ లేలాండ్‌ ప్రకటించింది.
 • జీవనకాల గరిష్ఠానికి జపాన్‌ నిక్కీ: జపాన్‌ ప్రామాణిక సూచీ ‘నిక్కీ 225’ జీవనకాల గరిష్ఠానికి చేరింది. గురువారం 2.2% లాభపడిన సూచీ, దాదాపు 34 ఏళ్ల గరిష్ఠమైన 39,098.68 పాయింట్ల వద్ద ముగిసింది. 1989 డిసెంబరు 29న నమోదైన 38,915.87 పాయింట్లు ఇప్పటివరకు రికార్డు గరిష్ఠంగా ఉంది. 
 • బైక్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యులు బైక్స్‌లో అదనంగా 45.75 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు బజాజ్‌ ఆటో తెలిపింది. దీంతో కంపెనీలో బజాజ్‌ ఆటో వాటా 18.8 శాతానికి పెరిగింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని