10 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ దిశగా.. భారత్‌

రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 830 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్‌ పయనిస్తోందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండా పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 03:16 IST

త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారొచ్చు
డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండా

దిల్లీ: రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 830 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్‌ పయనిస్తోందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండా పేర్కొన్నారు. ‘భారత్‌కు వచ్చినపుడు ఎక్కడా లేని ఆశావహ ధోరణి కనిపిస్తుంది. ప్రపంచమంతా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు రాజ్యమేలుతున్నాయి. భారత్‌లో మాత్రం 7 శాతంపైనే వృద్ధి నమోదవుతోంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది భారత ఆర్థిక వ్యవస్థే. అమెరికా కూడా రాణిస్తోంద’న్నారు. ‘ఈ ఏడాది దావోస్‌లో జరిగిన సదస్సులో భారత్‌పై భారీ ఆసక్తి కనిపించింది. ఈ ధోరణి కొనసాగుతుంద’ని తెలిపారు. ‘వచ్చే 2-3 ఏళ్లలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల డాలర్ల జీడీపీని చేరే దిశలో ఉంద’ని వివరించారు. ‘భారత్‌లో కీలక సంస్కరణలు చేపట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ పెరుగుతున్నాయి. భారీ స్థాయిలో తయారీ కార్యకలాపాలూ చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా వర్థమాన దేశాల్లో ఇవేమీ కనిపించవు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ దౌత్యంలో భారత్‌ పాత్ర మరింత పెరగగలద’ని బోర్గే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని