ప్చ్‌.. ఉద్యోగం వదిలేస్తోంది మహిళలే

వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతౌల్యం చేసుకోలేక మహిళలే అత్యధికంగా ఉద్యోగాలను వదిలేస్తున్నారని ఒక నివేదిక తేల్చింది.

Updated : 23 Feb 2024 12:02 IST

వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేయలేకే
పురుషుల్లో వైదొలగుతున్న వారు 4 శాతమే

దిల్లీ: వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతౌల్యం చేసుకోలేక మహిళలే అత్యధికంగా ఉద్యోగాలను వదిలేస్తున్నారని ఒక నివేదిక తేల్చింది. మహిళల్లో 34% మంది ఉద్యోగాలను ఈ కారణం చేతనే విడిచిపెట్టారని, మగవారిలో ఈ సంఖ్య 4 శాతమేనని పేర్కొంది. గోద్రేజ్‌ డెయి ల్యాబ్స్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ డేటా అండ్‌ అనాలసిస్‌, అశోకా యూనివర్శిటీ, డాస్రాల భాగస్వామ్యంతో ఉదైతి ఫౌండేషన్‌ ఈ నివేదికను రూపొందించింది. ఇందుకోసం 200 మంది సీనియర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ నివేదిక ప్రకారం..

  • మహిళలు ఉద్యోగాలను విడిచిపెట్టేందుకు ‘వేతనంపై ఆందోళన, కెరీర్‌ అవకాశాలు, ఉద్యోగ బాధ్యతలు-వ్యక్తిగత జీవితం మధ్య అసమతుల్యత’ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మగవారిలో మొదటి రెండు కారణాలు పైవే కాగా.. మూడో కారణం ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళన అని నివేదిక తెలిపింది. మహిళలు ఉద్యోగాలను విడిచిపెట్టకుండా అవసరమైన విధానాలు తీసుకొస్తే.. ఈ సమస్యకు పరిష్కారం చూపినట్లు అవుతుందని వివరించింది.
  • నియామకాల సమయంలో మహిళల వైవాహిక స్థితి, వయసును హెచ్‌ఆర్‌ మేనేజర్లు ప్రధానంగా గమనిస్తున్నారని, మహిళల నియామకానికి ఇవి ప్రధానంగా అడ్డంకులుగా మారుతున్నాయని పేర్కొంది. మహిళల వైవాహిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటామని 38% మంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు వెల్లడించగా.. పురుష అభ్యర్థుల విషయంలో ఇది 22 శాతంగానే ఉంది.
  • మగవారితో పోలిస్తే మహిళల విషయంలో వయసు, నివాస ప్రాంతాలనూ కాస్త ఎక్కువగానే పరిగణనలోకి తీసుకుంటున్నారు. మహిళల వయసును 43% మంది, నివాస ప్రాంతాన్ని 26% మంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మగవారిలో ఇది వరుసగా 39%; 21 శాతంగా ఉంది.
  • లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం కింద ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీని ఏర్పాటు చేయడం తప్పనిసరి అయినప్పటికీ.. ఆ నిబంధనను తమ కంపెనీలు పాటించడం లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 59% మంది వెల్లడించడం గమనార్హం. మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను నియంత్రించడంలో అలసత్వాన్ని ఇది సూచిస్తోందని నివేదిక అభిప్రాయపడింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు