సంక్షిప్త వార్తలు(5)

ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఈసీయూ సాఫ్ట్‌వేర్‌ను రీప్రోగ్రామింగ్‌ చేసే ఉద్దేశంతో, 269 ‘ల్యాండ్‌ క్రూయిజర్‌ 300’ వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు (రీకాల్‌) టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తెలిపింది.

Published : 24 Feb 2024 02:25 IST

269 ‘ల్యాండ్‌ క్యూయిజర్‌ 300’ వాహనాలు వెనక్కి: టొయోటా

దిల్లీ: ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఈసీయూ సాఫ్ట్‌వేర్‌ను రీప్రోగ్రామింగ్‌ చేసే ఉద్దేశంతో, 269 ‘ల్యాండ్‌ క్రూయిజర్‌ 300’ వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు (రీకాల్‌) టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తెలిపింది. 2021 ఫిబ్రవరి 12 నుంచి 2023 ఫిబ్రవరి 1 మధ్య తయారైన వాహనాలకు ఈ రీకాల్‌ వర్తిస్తుందని తెలిపింది. దీనిపై టొయోటో డీలర్లు, వినియోగదార్లకు సమాచారం ఇస్తారని పేర్కొంది.


ప్రజా రవాణాలో ముందస్తు చెల్లింపు సాధనాలు

వినియోగానికి అనుమతించిన ఆర్‌బీఐ

ముంబయి: వివిధ ప్రజా రవాణా వ్యవస్థల్లో వినియోగించుకునేలా ముందస్తు చెల్లింపు కార్డుల (పీపీఐ)ను జారీ చేసేందుకు కొన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ప్రీ పెయిడ్‌ కార్డు జారీ సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. ప్రయాణికులకు సౌలభ్యం, టిక్కెట్ల కొనుగోలులో వేగం, రవాణా సేవల కోసం డిజిటల్‌ చెల్లింపులు ఉపకరిస్తాయని పేర్కొంది. దీనివల్ల ప్రయాణికులకు టిక్కెట్ల కొనుగోలు కోసం నగదుతో పాటు ఇతర విధానాలనూ వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ వివరించింది.


6జీ సాంకేతికతలపై పరిశోధనకు నోకియా, ఐఐఎస్‌సీ జట్టు

దిల్లీ: సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)తో నోకియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన 6జీ ల్యాబ్‌లో ఈ పరిశోధనలు నిర్వహిస్తారు. 6జీ రేడియో టెక్నాలజీస్‌, 6జీ ఆర్కిటెక్చర్‌, 6జీ ఎయిర్‌ ఇంటర్‌ఫేస్‌లో మెషీన్‌ లెర్నింగ్‌ యాప్‌ అప్లికేషన్‌.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్‌సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్‌వర్క్‌ యాజ్ సెన్సార్‌ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల ద్వారా దృష్టి సారించనున్నట్లు తెలిపింది.


కోటక్‌ మహీంద్రా జనరల్‌లో జురిచ్‌ ఇన్సూరెన్స్‌కు 70% వాటా

దిల్లీ: తమ సాధారణ బీమా విభాగమైన కోటక్‌ మహీంద్రా జనరల్‌లో 70% వాటాను జురిచ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రూ.5560 కోట్లకు కొనుగోలు చేయనుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. కోటక్‌ జనరల్‌లో 51% కొనేందుకు గత నవంబరులోనే జురిచ్‌ ముందుకొచ్చింది. ఇప్పుడు కొనుగోలు చేసే వాటా మొత్తాన్ని మరింత పెంచనుంది.  


4వేలకు పైగా సెల్టోస్‌లు వెనక్కి: కియా

దిల్లీ: మధ్యస్థాయి ఎస్‌యూవీ సెల్టోస్‌ పెట్రోల్‌ మోడల్‌ కారులో, ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు కియా ఇండియా వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్‌ సెల్టోస్‌ (ఐవీటీ ట్రాన్స్‌మిషన్‌) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని