ఫోన్‌చేసేవారి పేరు కనిపిస్తుంది

ఫోన్‌ చేసిన వారి (కాలర్‌) పేరు మొబైల్‌పై కనిపించేలా కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌(సీఎన్‌ఏపీ) సప్లిమెంటరీ సర్వీస్‌ను అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదార్లకు అందించాలని ట్రాయ్‌ సిఫారసు చేసింది.

Published : 24 Feb 2024 02:26 IST

సీఎన్‌ఏపీ అనుబంధ సేవలకు ట్రాయ్‌ సిఫారసు

దిల్లీ: ఫోన్‌ చేసిన వారి (కాలర్‌) పేరు మొబైల్‌పై కనిపించేలా కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌(సీఎన్‌ఏపీ) సప్లిమెంటరీ సర్వీస్‌ను అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదార్లకు అందించాలని ట్రాయ్‌ సిఫారసు చేసింది. ప్రస్తుతం మనం నిక్షిప్తం చేసుకున్న నంబర్లకు సంబంధించిన వారి పేర్లే కనపడుతున్నాయి. తాజా సిఫారసులు అమలైతే, దేశీయంగా విక్రయించే అన్ని మొబైళ్లలో ఈ ఫీచరు ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని టెలికాం నియంత్రణాధికార సంస్థ పేర్కొంది. సిమ్‌ కనెక్షన్‌ తీసుకునేప్పుడు కస్టమర్‌ అప్లికేషన్‌ ఫామ్‌(సీఏఎఫ్‌)లో వినియోగదారు నమోదు చేసే పేరే, మొబైల్‌ తెరపై కనపడుతుంది. ఇప్పటికే ట్రూకాలర్‌, భారత్‌ కాలర్‌ ఐడీ, యాంటీ స్పామ్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌లు ఇలా కాలర్‌ పేరును చూపిస్తున్నా.. అవన్నీ క్లౌడ్‌ సోర్సెడ్‌ డేటా ఆధారిత సేవలుగా ఉన్నాయి కాబట్టి విశ్వసించలేమని ట్రాయ్‌ గుర్తు చేసింది. అంటే మన పేరును ఇతరులు తమ మొబైళ్లలో ఏ పేరుతో సేవ్‌ చేస్తే, అదే కనిపిస్తుంది మినహా అసలు పేరు కనిపించదు. వినియోగదార్ల విజ్ఞప్తిపై ఈ సీఎన్‌ఏపీ సేవలను అన్ని కంపెనీలు అందించాల్సి ఉంటుందని ట్రాయ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని