రుణాల ముందస్తు తనిఖీ కోసం పోర్టల్‌

బ్యాంకులు రుణాలను పంపిణీ చేసే ముందు జరిగే అనుమతి ప్రక్రియను క్రమబద్ధీకరించడం కోసం, ఆయా రుణస్వీకర్తలు, మొండి ఖాతాల వివరాలకు సంబంధించి ముందస్తు తనిఖీలు చేపట్టడం కోసం ఒక పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది.

Published : 24 Feb 2024 02:27 IST

ఆవిష్కరించిన సీఈఐబీ
అన్ని బ్యాంకులూ వినియోగించుకోవచ్చు

దిల్లీ: బ్యాంకులు రుణాలను పంపిణీ చేసే ముందు జరిగే అనుమతి ప్రక్రియను క్రమబద్ధీకరించడం కోసం, ఆయా రుణస్వీకర్తలు, మొండి ఖాతాల వివరాలకు సంబంధించి ముందస్తు తనిఖీలు చేపట్టడం కోసం ఒక పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(సీఈఐబీ) దీనిని ఆవిష్కరించింది. రుణ మంజూరుపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని బ్యాంకులకు వేగంగా అందించడమే దీని లక్ష్యమని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌  పేర్కొంది.

ఇకపై ఇలా: బ్యాంకుల్లో రుణ మోసాలను నివారించేందుకు, ఆర్థిక సేవల విభాగం 2015, 2019లలో జారీ చేసిన నిబంధనల ప్రకారం.. కొత్త రుణస్వీకర్తలకు రూ.50 కోట్లపైన రుణాలను మంజూరు చేయాలంటే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సీఈఐబీ నుంచి నివేదికను కోరాలి. ప్రస్తుత రుణస్వీకర్త ఖాతా నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా మారడంపైనా సీఈఐబీని సంప్రదించాలి. ఐబీఏ విజ్ఞప్తి అనంతరం 2022 ఆగస్టులో నివేదికలను కోరే విషయంలో ఏకరూప ఫార్మేట్‌ను సీఈఐబీ తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌(ఎస్‌పీఓసీ) హోదాలో నోడల్‌ ఆఫీసర్లను నియమించుకోవాలనీ సలహా ఇచ్చింది. దీంతో అన్ని బ్యాంకులు నోడల్‌ ఆఫీసర్లను నియమించాయి. అలా నియమించిన నోడల్‌ ఆఫీసర్ల వివరాలను సీఈఐబీకి ఐబీఏ పంపింది. ఇపుడు ఒక సరైన పద్ధతిలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరి ఇంటెలిజెన్స్‌ అనుమతులు పొందేందుకు వీలుగా ఎస్‌బీఐతో కలిసి సీఈఐబీ ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫారాన్ని తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని