ఆద్యంతం ఒడుదొడుకులు

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు, అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఐటీ, కొన్ని బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 6 పైసలు తగ్గి 82.91 వద్ద ముగిసింది.

Published : 24 Feb 2024 02:31 IST

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు, అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఐటీ, కొన్ని బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 6 పైసలు తగ్గి 82.91 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.2% నష్టంతో 82.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,394.44 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,413.93 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 73,022 వద్ద కనిష్ఠానికి చేరి, చివరకు 15.44 పాయింట్ల నష్టంతో 73,142.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 4.75 పాయింట్లు తగ్గి 22,212.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,186.10- 22,297.50 పాయింట్ల మధ్య కదలాడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.25%, మారుతీ 1.17%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.12%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.91%, ఎస్‌బీఐ 0.86%, టీసీఎస్‌ 0.84% డీలాపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.43%, టైటన్‌ 1.13%, ఎం అండ్‌ ఎం  1.13%, విప్రో 0.90%, రిలయన్స్‌ 0.78%, ఎల్‌ అండ్‌ టీ 0.77% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో చమురు-గ్యాస్‌ 0.81%, ఇంధన 0.36%, లోహ  0.33%, బ్యాంకింగ్‌ 0.29% పడ్డాయి. పరిశ్రమలు, టెలికాం, యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులు రాణించాయి. బీఎస్‌ఈలో 1833 షేర్లు నష్టాల్లో ముగియగా, 2005 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 98 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • రికార్డు గరిష్ఠానికి జియో ఫైనాన్షియల్‌ షేరు: జియో ఫైనాన్షియల్‌ షేరు శుక్రవారం దుమ్మురేపింది. ఇంట్రాడేలో రూ.347 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 10.18% లాభంతో రూ.333.90 వద్ద ముగిసింది. ఒకదశలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.27,922.69 కోట్లు పెరిగి రూ.2.20 లక్షల కోట్లకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి రూ.2.12 లక్షల కోట్లుగా నమోదైంది.
  • దిల్లీ మెట్రో నాలుగో దశ కోసం మెట్రోపొలిస్‌ ట్రైన్‌సెట్‌ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఫ్రాన్స్‌ సంస్థ ఆల్‌స్తోమ్‌ ప్రకటించింది. 2022 నవంబరులో కంపెనీ ఈ ఆర్డరు అందుకుంది. ఇందులో భాగంగా ఆరు కార్లు కలిగిన 52 ట్రైన్‌ సెట్‌లను అందించనుంది.
  • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల రేటింగ్‌ తగ్గింపు: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల రేటింగ్‌ను కొనుగోలు నుంచి ‘తటస్థం’కు తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. ఎస్‌బీఐ షేరు 4%, ఐసీఐసీఐ 3% వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. యెస్‌ బ్యాంక్‌ షేరును తటస్థం నుంచి అమ్మకంగా మార్చింది. ఈ షేరు 37% పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు రేటింగ్‌ను అమ్మకం నుంచి తటస్థంకు పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 33% పెరగొచ్చని, కొనుగోలు చేయొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ సిఫారసు చేసింది. ఆర్థిక రంగంలో మంచి రోజులు ముగిసే అవకాశం ఉందని, సమీప భవిష్యత్‌లో ఒడొడుకులు ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది.
  • 5 బి.డాలర్లు తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు: ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 5.24 బి.డాలర్లు (దాదాపు రూ.43,000 కోట్లు) తగ్గి 617.23 బి.డాలర్ల (రూ.51.23 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు 4.07 బి.డాలర్లు తగ్గి 546.52 బి.డాలర్లుగా నమోదయ్యాయి. ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 28 మిలియన్‌ డాలర్లు కోల్పోయి, 48.32 బి.డాలర్లకు పరిమితమైంది.
  • జునిపర్‌ హోటల్స్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి మొత్తంగా 2.08 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,89,47,367 షేర్లను ఆఫర్‌ చేయగా, 6,01,14,160 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 2.96 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 85%, రిటైల్‌ విభాగంలో 1.28 రెట్ల స్పందన వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని