బైజూస్‌లో ముదిరిన వివాదం

అవకతవకలు, పాలనా వైఫల్యాల ఆరోపణల నేపథ్యంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజూ రవీంద్రన్‌, ఆయన కుటుంబ సభ్యులను బోర్డు నుంచి తొలగించాలంటూ అధిక వాటాదార్లు ఓటు వేశారు.

Published : 24 Feb 2024 02:35 IST

సీఈఓ బైజూ రవీంద్రన్‌, కుటుంబ సభ్యులను తొలగించాలంటూ మెజార్టీ వాటాదార్ల ఓటు
ఆ ఓటింగ్‌ చెల్లదన్న కంపెనీ
ఎన్‌సీఎల్‌టీలోనూ యాజమాన్యంపై కేసు

దిల్లీ: అవకతవకలు, పాలనా వైఫల్యాల ఆరోపణల నేపథ్యంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజూ రవీంద్రన్‌, ఆయన కుటుంబ సభ్యులను బోర్డు నుంచి తొలగించాలంటూ అధిక వాటాదార్లు ఓటు వేశారు. శుక్రవారం సంస్థ వాటాదార్లు నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో 60 శాతం మందికి పైగా సభ్యులు, బైజూ రవీంద్రన్‌, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఈ సమావేశానికి వ్యవస్థాపకులెవరూ హాజరుకానందున, ఆ ఓటింగ్‌ ప్రక్రియ చెల్లిందని కంపెనీ పేర్కొంది.

7 తీర్మానాలపైనా ఏకగ్రీవ ఓటు

‘ఓటింగ్‌ కోసం ప్రవేశపెట్టిన 7 తీర్మానాలకు వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపార’ని ఈజీఎంకు పిలుపునిచ్చిన 6 మదుపు సంస్థల్లో ఒకటైన ప్రోసస్‌ తెలిపింది. పాలనా లోపాలు, ఆర్థిక అవకతవకలు, నిబంధనల పాటింపులో వైఫల్యాలను పరిష్కరించడం, ప్రస్తుత యాజమాన్యం తొలగింపు, డైరెక్టర్ల బోర్డు పునర్నియామకం, కంపెనీ నాయకత్వంలో మార్పు, కంపెనీ చేసిన కొనుగోళ్లపై థర్డ్‌పార్టీ ఫోరెన్సిక్‌ దర్యాప్తు లాంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం బైజూస్‌ బోర్డులో బైజూ రవీంద్రన్‌, భార్య దివ్యా గోకుల్‌నాధ్‌, సోదరుడు రిజు రవీంద్రన్‌ మాత్రమే డైరెక్టర్లుగా ఉన్నారు.

కంపెనీల చట్టం ప్రకారం శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఎటువంటి విలువ లేదంటూ, ఈ ముగ్గురూ ఈజీఎంకు దూరంగా ఉన్నారు. ఈజీఎం ఓటింగ్‌ ఫలితాలు ఎలా ఉన్నా.. మార్చి 13 వరకు అవి ప్రభావం చూపవు. మదుపర్ల పిటిషన్‌ను సవాలు చేస్తూ బైజూ రవీంద్రన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 13న కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణ చేయనుండటమే ఇందుకు కారణం.

అరగంట ఆలస్యంగా..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బైజూస్‌ ఈజీఎం ప్రారంభం కావాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బైజూస్‌కు చెందిన కొందరు ఉద్యోగులు సహా సుమారు 200 మంది తాము వర్చువల్‌గా (దృశ్య మాధ్యమ పద్ధతిలో) ఈ సమావేశంలో పాల్గొంటామని అడగడమే ఇందుకు కారణమట. నిశిత పరిశీలన అనంతరమే వాటాదార్లను సమావేశం మందిరం లోపలకు అనుమతినిచ్చారు. వాటాదార్ల తరపున 40 మంది  పాల్గొన్నారు.

కోర్టు తిరస్కరణ నేపథ్యంలోనే

కంపెనీ బోర్డును రద్దు చేసే నిమిత్తం వాటాదార్లు పిలుపునిచ్చిన ఈజీఎంను ఆపేందుకు బుధవారం హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పిలుపు నిచ్చిన ఆరుగురు ప్రధాన వాటాదార్లకు బైజూస్‌ను నిర్వహిస్తున్న థింగ్‌ అండ్‌ లెర్న్‌లో 32% వాటా ఉండగా.. రవీంద్రన్‌ కుటుంబానికి 26.3% వాటా ఉంది. ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ అండ్‌ షేర్‌హోల్డర్స్‌ అగ్రిమెంట్‌ ప్రకారం.. ఈజీఎంను నిర్వహించాలంటే వ్యవస్థాపకుల నుంచి కనీసం ఒకరైనా హాజరు కావాల్సి ఉంటుందని వాటాదార్లకు రాసిన లేఖలో రవీంద్రన్‌ తెలిపారు. ఈజీఎం ప్రారంభమయ్యే సమయానికి అరగంటలోగా ఏ ఒక్క వ్యవస్థాపకుడు హజరుకాకుంటే, సమావేశాన్ని నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఈజీఎంలో నిర్ణయాలు తీసుకున్నా, తదుపరి విచారణ తేదీ వరకు వర్తించబోవని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాలనూ ఆయన ప్రస్తావించారు.  బైజూస్‌ యాజమాన్య సన్నిహిత వర్గాలు మాత్రం మదుపర్లలో 47% మందే, రవీంద్రన్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్లు చెబుతున్నాయి.


పిటిషన్‌లో ఏమి ఉందంటే..

ఈజీఎంకు ముందు కంపెనీ యాజమాన్యంపై బెంగళూరు ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనంలో బైజూస్‌కు చెందిన నలుగురు ప్రధాన వాటాదార్ల (ప్రోసస్‌, జీఏ, సోఫినా, పీక్‌ ఎక్స్‌వీ) బృందం ‘అణిచివేత, పాలనా దుర్వినియోగం’ దావా వేసింది. ఈ కంపెనీలకు మరో రెండు పెట్టుబడిసంస్థలు టైగర్‌, ఓవల్‌ వెంచర్స్‌  కూడా మద్దతు తెలిపాయి. వాటాదార్ల విలువ హరించుకపోకుండా నియంత్రించేందుకు, ఇతర వాటాదార్ల (ఉద్యోగులు, వినియోగదార్ల) ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌పై తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని బైజూస్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ విచారణకు చేపడితే నోటిసులు జారీ చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పిటిషన్‌లో వాటాదార్లు పొందుపర్చిన వివరాల ప్రకారం..

  • బైజూ రవీంద్రన్‌ సహా వ్యవస్థాపకులందరూ కంపెనీ నిర్వహణకు అనర్హులని ప్రకటించి, కొత్త బోర్డును నియమించాలి. ఇటీవల ముగిసిన రైట్స్‌ ఇష్యూను రద్దు చేయాలి. కంపెనీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలి.
  • సీఎఫ్‌ఓ, స్వతంత్ర డైరెక్టరు నియామకం చేయకపోవడం సహా కార్పొరేట్‌ పాలనా పరమైన సమస్యలు ఇంకా కంపెనీలో కొనసాగుతున్నాయి.
  • వ్యవస్థాపకుల ఆర్థిక అవకతకవల వల్లే ఆకాశ్‌ సంస్థపై నియంత్రణను కోల్పోవాల్సి వచ్చింది. బైజూస్‌ ఆల్ఫా దివాలా దశకు చేరింది.
  • ఇటీవల ముగిసిన 200 మిలియన్‌ డాలర్ల రైట్స్‌ ఇష్యూలో కంపెనీ నిబంధనలు పాటించలేదు. వాటాదార్లతో సమాచారం పంచుకోవడంలోనూ విఫలమైంది.
  • సింగపూర్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ నార్త్‌వెస్ట్‌ ఎడ్యుకేషన్‌ పీటీఈ కొనుగోలుకు సంబంధించి అనధికారిక కార్పొరేట్‌ కార్యకలాపాలకు పాల్పడింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని