మా సొంతూరులో విమానాశ్రయం.. సంతోషంగా ఉంది

‘మా సొంతూరు క్రీట్‌ ద్వీపంలో జీఎంఆర్‌ సంస్థ విమానాశ్రయం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. గ్రీస్‌ దేశంలో మౌలికరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ నుంచి పెద్దసంఖ్యలో సంస్థలు వస్తున్నాయి’ అని గ్రీస్‌ ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ అన్నారు.

Published : 24 Feb 2024 02:35 IST

గ్రీస్‌ ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘మా సొంతూరు క్రీట్‌ ద్వీపంలో జీఎంఆర్‌ సంస్థ విమానాశ్రయం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. గ్రీస్‌ దేశంలో మౌలికరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ నుంచి పెద్దసంఖ్యలో సంస్థలు వస్తున్నాయి’ అని గ్రీస్‌ ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ అన్నారు. భారతదేశంలో పర్యటిస్తున్న ఆయన, జీఎంఆర్‌ సంస్థ నిర్మించిన దిల్లీ విమానాశ్రయాన్ని బుధవారం సాయంత్రం సందర్శించారు. దిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను చూసి అభినందించారు. క్రీట్‌ ద్వీపంలో నిర్మిస్తున్న విమానాశ్రయం గ్రీస్‌ దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. అక్కడ అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలను ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని వివరించారు. భారత్‌లో పర్యటించేందుకు వచ్చి, దిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని కిరియాకోస్‌తో జీఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ జీఎం రావు అన్నారు. జీఈకే టెర్నా సహకారంతో క్రీట్‌ ద్వీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, ఏథెన్స్‌ విమానాశ్రయం తర్వాత ఇది రెండో అతిపెద్దదని జీఎం రావు వివరించారు. ఈ సమావేశంలో జీఎంఆర్‌ బిజినెస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల, జీఎంఆర్‌ రవాణా విభాగం ఛైర్మన్‌ బీవీఎన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని