పేటీఎమ్‌ వినియోగదార్లకు సాయం చేయండి

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) వినియోగదార్లకు చెందిన యూపీఐ హ్యాండిల్‌ (జీపేటీఎమ్‌)ను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కోరింది.

Published : 24 Feb 2024 02:37 IST

యూపీఐ కార్యకలాపాలు కొనసాగాలి
హ్యాండిల్‌ బదిలీ సాఫీగా జరిపించాలని ఎన్‌పీసీఐని కోరిన ఆర్‌బీఐ

ముంబయి: పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) వినియోగదార్లకు చెందిన యూపీఐ హ్యాండిల్‌ (జీపేటీఎమ్‌)ను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కోరింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో ఇబ్బందులు రాకుండా చూడాలంది. 2024 మార్చి 15 అనంతరం పీపీబీఎల్‌ ఖాతాలు, వాలెట్లలో డిపాజిట్లు/టాపప్‌లు చేసే వీలు లేకుండా ఆర్‌బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీపీబీఎల్‌ సేవలందుకుంటున్న వినియోగదార్లు, వాలెట్‌ హోల్డర్లు, వ్యాపారుల ప్రయోజనాల నిమిత్తం శుక్రవారం ఆర్‌బీఐ కొన్ని అదనపు చర్యలతో ముందుకొచ్చింది. అవేంటంటే..

వినియోగదార్లకు ఇలా..: పేటీఎమ్‌ యాప్‌లో యూపీఐ కార్యకలాపాలు కొనసాగించడానికి థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌(టీపీఏపీ)గా ఉంటామన్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ విజ్ఞప్తిని పరిశీలించాలని ఎన్‌పీసీఐకి సూచించింది. టీపీఏపీ హోదాను వన్‌97 కమ్యూనికేషన్స్‌కు, ఎన్‌పీసీఐ ఇచ్చిన పక్షంలో ‘జీపేటీఎమ్‌’ హ్యాండిళ్లను పీపీబీఎల్‌ నుంచి ఇతర బ్యాంకులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా బదిలీ అయ్యేలా చూడాలి.

ప్రస్తుత వినియోగదార్లు కొత్త హ్యాండిళ్లకు సంతృప్తికరంగా బదిలీ అయ్యేంత వరకు, కొత్త వినియోగదార్లను టీపీఏపీ జత చేసుకోరాదు.

ఇతర బ్యాంకులకు ‘జీపేటీఎమ్‌ హ్యాండిల్‌ను బదిలీ చేసేందుకు, 4-5 బ్యాంకులకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌(పీఎస్‌పీ) బ్యాంకులుగా ధ్రువీకరణ ఇవ్వొచ్చు. ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారమే ఇది జరగాలి.

వ్యాపారులకు ఇలా..: పేటీఎమ్‌ క్యూఆర్‌ కోడ్‌లు వినియోగిస్తున్న వ్యాపారులకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పీఎస్‌పీ బ్యాంకుల్లో సెటిల్‌మెంట్‌ ఖాతాలను వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెరవొచ్చు.

ఇతర హ్యాండిళ్లు ఉన్నవారికైతే..: జీపేటీఎమ్‌ హ్యాండిళ్లు ఉన్న వినియోగదార్లు, వ్యాపారులకు మాత్రమే పైన చెప్పిన చర్యలు వర్తిస్తాయి. జీపేటీఎమ్‌ కాకుండా ఇతర యూపీఐ అడ్రెస్‌ లేదా హ్యాండిల్‌ ఉన్నవారికి ఎటువంటి మార్పులూ చేయరాదు. నీ పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాతా/వాలెట్‌ ఉన్న వినియోగదార్లు మార్చి 15 లోగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆర్‌బీఐ మరోసారి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని