ఇంటి నుంచి పని.. ముగిసినట్లే!

‘మార్చి చివరికల్లా ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఉద్యోగులకు ఇస్తున్న చివరి అవకాశం ఇదే’

Updated : 24 Feb 2024 07:32 IST

కార్యాలయాలకు రావాల్సిందేనంటున్న ఐటీ కంపెనీలు
ఉద్యోగులను వెంటాడుతున్న లేఆఫ్‌ల బెడద
ఇళ్లు, వాణిజ్య భవనాలకు గిరాకీ

‘మార్చి చివరికల్లా ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఉద్యోగులకు ఇస్తున్న చివరి అవకాశం ఇదే’

టీసీఎస్‌

‘ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులు.. ఫ్రెషర్లు వారంలో 5 రోజులూ కార్యాలయాలకు రావాల్సిందే. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’

హెచ్‌సీఎల్‌ 

ఇవే కాదు.. ఇన్ఫోసిస్‌, విప్రో, ఒరాకిల్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) విధానానికి స్వస్తి పలకాలని చూస్తున్నాయి. ‘ఇంటి నుంచి పని’ వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని కొవిడ్‌ సమయంలో పేర్కొన్న కంపెనీలే, ఇప్పుడు మాత్రం కంపెనీకి వచ్చి, బృందంగా పనిచేస్తేనే వినూత్నత, ఉత్పాదకత పెరుగుతాయని అంటున్నాయి. అసలే నియామకాలు తగ్గడంతో పాటు విదేశాల్లో భారీ సంఖ్యలో లేఆఫ్‌లు అమలవుతున్న తరుణంలో, ఇక్కడి ఉద్యోగులు కంపెనీల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. స్వస్థలాల నుంచి ఉద్యోగుల కుటుంబాలు తరలి వస్తున్నందున, ఐటీ కంపెనీల సమీప ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి.

ఇదీ జరిగింది

కొవిడ్‌కు ముందు కూడా ఐటీ ఉద్యోగులు వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పని చేసేవారు. కొవిడ్‌ సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి కంపెనీలు అనుమతించాయి.  ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నందున, కొన్ని ఐటీ కంపెనీలు నిర్వహణ వ్యయాలు అదుపు చేసేందుకు, అద్దె భవనాలను ఖాళీ చేశాయి కూడా. 

కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతున్న సమయంలో హైబ్రిడ్‌ (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పనిచేసే) విధానాన్ని కంపెనీలు అమలు చేశాయి. ఇప్పుడు కొవిడ్‌ కేసులు పూర్తిగా తగ్గినందున, ఉద్యోగులను పూర్తిగా కార్యాలయాలకు రమ్మని ఒత్తిడి తెస్తున్నాయి. అసలే లేఆఫ్‌ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, కార్యాలయాలకు రావడం మినహా ఐటీ ఉద్యోగులకు మరో దారి కనిపించడం లేదు.

కారణాలు ఉన్నాయ్‌

మన ఐటీ కంపెనీలకు ప్రధాన ఖాతాదారులున్న అమెరికా, ఐరోపాల్లో ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నాయి. ఫలితంగా ఖాతాదారులు ఐటీపై వ్యయాలకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ప్రాజెక్టులు భారీగా రావడంతో, అధిక వేతనాలపై ఉద్యోగులను నియమించుకున్న సంస్థలకు ఇప్పుడు వారు భారంగా కనపడుతున్నారు. ఫలితంగా దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దేశీయ ఐటీ రంగంలో భారీ తొలగింపులు లేకున్నా, గిరాకీ తగ్గిన ఎడ్‌టెక్‌, ఇ-కామర్స్‌, అంకుర సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు 60,000 కు పరిమితమయ్యాయని ఐటీ కంపెనీల సంఘం నాస్‌కామ్‌ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు రాకపోతే.. మన దగ్గరా పరిస్థితులు శరవేగంగా మారే ప్రమాదం ఉంది. కృత్రిమ మేధ ప్రభావంపై అంచనాలూ కలవరపెడుతున్నాయి. కొత్త నియామకాలు తగ్గినందున, ఉద్యోగులు వేరే కంపెనీలకు మారదామన్నా ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు.

ఉద్యోగులు ఏమంటున్నారంటే..

ఐటీ రంగంలోని చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. పెద్ద కంపెనీల్లోనే ఇంకా కొంత వెసులుబాటు ఉంది. రోజూ కార్యాలయాలకు రావడానికి ఎక్కువ శాతం ఉద్యోగులు ఇష్టపడటం లేదని, 25- 34 ఏళ్ల వారు విముఖత ప్రదర్శిస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడా.. వంటి ఐటీ కంపెనీలు కేంద్రీకృతమైన నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి, వచ్చేందుకు రోడ్లపై కనీసం 2-3 గంటలు పడుతోందని.. ఈ చికాకు ఉండదు కనుక ‘ఇంటి నుంచి మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు’  ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ సమయంలో ఇంటి నుంచి కదలకున్నా, తమ బృందాలతో అద్భుతంగా పనిచేశామని గుర్తు చేస్తున్నారు.

ఈనాడు వాణిజ్య విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని