బైజూస్‌ సీఈఓ నేనే

బైజూస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా తానే కొనసాగుతున్నానని, యాజమాన్యంలోనూ ఎటువంటి మార్పు లేదని ఉద్యోగులకు రాసిన లేఖలో బైజూ రవీంద్రన్‌ స్పష్టం చేశారు.

Published : 25 Feb 2024 02:15 IST

తొలగించారనే వార్తల్లో నిజం లేదు: రవీంద్రన్‌

దిల్లీ: బైజూస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా తానే కొనసాగుతున్నానని, యాజమాన్యంలోనూ ఎటువంటి మార్పు లేదని ఉద్యోగులకు రాసిన లేఖలో బైజూ రవీంద్రన్‌ స్పష్టం చేశారు. అలాగే శుక్రవారం జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశం(ఈజీఎం)ను ఒక ‘నాటకం’గా ఆయన అభివర్ణించారు. బైజూస్‌లో బోర్డు డైరెక్టర్లుగా రవీంద్రన్‌, ఆయన కుటుంబ సభ్యులను తొలగించేందుకు ఈజీఎంలో మెజార్టీ వాటాదార్లు ఓటేసిన తర్వాతి రోజే ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఈజీఎంలో పలు కీలక నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, అందులో తీసుకున్న నిర్ణయాలు లెక్కలోకి రావని పేర్కొన్నారు. మీడియా ద్వారా ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. నీతి, నిజాయతీలదే అంతిమ విజయమని తాను బలంగా విశ్వసిస్తానని తెలిపారు. సమావేశంలో ఏదేని తీర్మానాన్ని ఆమోదించాలంటే కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టరు హాజరు కావాలని నిబంధనలు చెబుతున్నందున.. ఈజీఎంలో తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. ‘ఈజీఎంలో తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం లభించిందంటూ కొంత మంది మైనార్టీ వాటాదార్లు చెబుతున్న దానిలో నిజం లేదు. 170 మంది వాటాదార్లలో (45% వాటాకు ప్రాతినిధ్యం) కేవలం 35 మందే తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అంటే చాలా పరిమిత మద్దతే లభించిందనే విషయాన్ని ఇది తెలియజేస్తోంద’ని రవీంద్రన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని