సంక్షిప్త వార్తలు

భారత పర్యటనలో ఉన్న ఉబర్‌ సీఈఓ డారా ఖోస్రోవాహితో శనివారం అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు.

Published : 25 Feb 2024 02:17 IST

భవిష్యత్‌లో ఉబర్‌తో అదానీ జట్టు!

దిల్లీ: భారత పర్యటనలో ఉన్న ఉబర్‌ సీఈఓ డారా ఖోస్రోవాహితో శనివారం అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. భవిష్యత్‌లో ఇరు సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఈ భేటీ ద్వారా సంకేతాలిచ్చారు. అలాగే ఇరువురు వ్యాపార అధిపతుల మధ్య చర్చల్లో భారత వృద్ధి గాథ, ఉపఖండంపై వారి అంచనాలు ప్రస్తావనకు వచ్చాయి. ‘ఉబర్‌ సీఈఓతో అద్భుతమైన చర్చ జరిగింది. భారత్‌లో విస్తరణపై ఆయనకున్న దూరదృష్టి నిజంగా స్ఫూర్తిమంతం. ముఖ్యంగా భారత డ్రైవర్లను వృద్ధిలోకి తీసుకొచ్చే విషయంలో ఆయనకున్న నిబద్ధత మెచ్చుకోదగినది. డారా, ఆయన బృందంతో భవిష్యత్‌లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉత్సుకతతో ఉన్నామ’ని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అదానీ తెలిపారు. అయితే సమావేశ ఫొటోలను అదానీ పోస్ట్‌ చేసినప్పటికీ... సమావేశం ఎక్కడ జరిగిందనే వివరాలను ఆయన తెలియజేయలేదు. అహ్మదాబాద్‌లోని అదానీ గ్రూపు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లుగా ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.


విచారణ స్వీకరణకు ముందే 27,514 దివాలా దరఖాస్తుల ఉపసంహరణ

ఐబీబీఐ

దిల్లీ: 2023 అక్టోబరు వరకు 27,514 కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ) దరఖాస్తులు.. విచారణకు స్వీకరించడాని కంటే ముందే ఉపసంహరించుకున్నారని ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(ఐబీబీఐ) తెలిపింది. ఈ దరఖాస్తులతో రూ.9.74 లక్షల కోట్ల బకాయిలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ‘ఎగవేత పరిస్థితి తప్పదని భావించినప్పుడో.. తిరిగి చెల్లించాలని నోటీసులు వచ్చినప్పుడనే కాదు.. దివాలా పరిష్కార ప్రక్రియ దరఖాస్తు సమర్పణకు ముందు, సమర్పణ తర్వాత, విచారణ స్వీకరణకు ముందు, అవసరమైతే విచారణ స్వీకరణ తర్వాత కూడా రుణ పరిష్కారం చేసుకుంటున్నారు. ఇలా దివాలా పరిష్కార ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలను కార్పొరేట్‌ రుణ గ్రహీతలు చేస్తున్నార’ని ఐబీబీఐ తెలిపింది.

రూ.3.21 లక్షల కోట్లు వసూలు: 2023 డిసెంబరు వరకు 3,050 కార్పొరేట్‌ రుణ గ్రహీతలను-రుణ పరిష్కార ప్రక్రియ ద్వారా 891, అప్పీల్‌ లేదా సమీక్ష లేదా సెటిల్‌మెంట్‌ ద్వారా 1,124, ఉపసంహరణ ద్వారా 1,035- సంక్షోభం నుంచి బయటపడేసేందుకు దివాలా స్మృతి (ఐబీసీ) ఉపయోగపడింది. గతేడాది డిసెంబరు 31 వరకు దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రుణ సంస్థలకు రూ.3.21 లక్షల కోట్లు వసూలయ్యాయి. అయితే వీటి ద్వారా వాస్తవానికి రూ.10.07 లక్షల కోట్ల బకాయిలు రావాలని రుణ సంస్థలు క్లెయిమ్‌ చేసుకున్నాయి. ఈ ప్రకారం చూస్తే 32 శాతం మాత్రమే వసూలయ్యాయన్నమాట. లిక్విడేషన్‌ కోసం 2,376 కార్పొరేట్‌ రుణ గ్రహీతల దరఖాస్తులను సిఫారసు చేశారు. 2023 డిసెంబరు వరకు 830 కార్పొరేట్‌ రుణ గ్రహీతలను లిక్విడేషన్‌ చేశారు. దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తికి కాలపరిమితిని నిర్దేశిస్తూ.. 2016 డిసెంబరులో దివాలా స్మృతిని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


వ్యాపారులకు క్రెడిట్‌బీ వ్యక్తిగత రుణం

ఈనాడు, హైదరాబాద్‌: ఎలాంటి తనఖా అవసరం లేకుండా వ్యాపారులకు వ్యక్తిగత రుణాలను అందించే పథకాన్ని ప్రారంభించినట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ క్రెడిట్‌బీ వెల్లడించింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణాలు లభించక ఇబ్బంది పడుతుంటారని, వారికోసం రూ.30వేల నుంచి     రూ.3 లక్షల వరకూ రుణాలను అందిస్తున్నామని క్రెడిట్‌బీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మధుసూదన్‌ ఏకాంబరం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని