ఆతిథ్య పరిశ్రమ ఆదాయంలో 11-13% వృద్ధి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆతిథ్య పరిశ్రమ ఆదాయాలు   11-13 శాతం మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తన నివేదికలో అంచనా వేసింది.

Published : 25 Feb 2024 02:48 IST

2024-25పై క్రిసిల్‌ అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే

ముంబయి: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆతిథ్య పరిశ్రమ ఆదాయాలు   11-13 శాతం మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తన నివేదికలో అంచనా వేసింది. దేశీయంగా గిరాకీ స్థిరంగా ఉండటం, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణాలుగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆతిథ్య పరిశ్రమ ఆదాయ వృద్ధి 15-17 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గిరాకీలో స్థిరత్వం కారణంగా సమీప కాలంలో పరిశ్రమ నిర్వహణ పనితీరు మెరుగ్గానే ఉండొచ్చని వివరించింది. దీనివల్ల ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ లాభదాయకతలో జోరు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మూలధన వ్యయాలు పరిమితంగా ఉండటం వల్ల.. రుణ ప్రొఫైల్‌ కూడా బలంగానే ఉంటుందని తెలిపింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమకు కీలక చోదకంగా నిలిచిన దేశీయ ప్రయాణ గిరాకీ.. వచ్చే సంవత్సరంలోనూ కొనసాగొచ్చు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన ప్రదర్శన కారణంగా వ్యాపారాలకు గిరాకీ పెరగనుండటం ఇందుకు దోహదం చేయొచ్చు. కొవిడ్‌-19 పరిణామాల భయాలు తొలగడంతో విహార యాత్రలకు వెళ్తున్న వారి సంఖ్యలో వృద్ధి కొనసాగడం కూడా తోడ్పడొచ్చు. అయితే గిరాకీపరంగా సానుకూలతలు ఉన్నప్పటికీ.. అధిక ప్రాతిపదిక (హై బేస్‌ ఎఫెక్ట్‌) ప్రభావం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తక్కువగా ఉండొచ్చ’ని వివరించింది.

  • సగటు గది ధరలు (ఏఆర్‌ఆర్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో   10-12 శాతం మేర పెరిగే అవకాశం ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది   5-7 శాతంగా ఉండొచ్చని నివేదిక తెలిపింది.
  • ఆక్యుపెన్సీ ప్రస్తుత స్థాయైన 73- 74 శాతంగా కొనసాగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టరు ఆనంద్‌ కులకర్ణి తెలిపారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యాటకుల రాక పెరిగినప్పటికీ.. కొవిడ్‌-19 ముందు స్థాయిలతో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్‌ తెలిపింది. ఒకవేళ ఈ సంఖ్య పుంజుకుంటే వచ్చే సంవత్సరంలో హోటళ్లకు గిరాకీ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.
  • కొవిడ్‌-19 పరిణామాల తర్వాత కార్పొరేట్‌లు తమ కార్యకలాపాలను పునరుద్ధరించడంతో ఎంఐసీఈ (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కన్వెన్షన్స్‌, ఈవెంట్స్‌) విభాగంలో గిరాకీ కూడా బలంగానే ఉందని తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని