రోగులకు ఇంటి వద్దే నర్సింగ్‌ సేవలు

వివిధ రకాలైన వ్యాధులకు ఆసుపత్రులలో శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు చేయించుకొని ఇంటి దగ్గర కోలుకుంటున్న తరుణంలో రోగులకు అవసరమైన నర్సింగ్‌, ఫిజియో థెరపీ సేవలు అందించే సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది.

Updated : 25 Feb 2024 02:50 IST

కార్యకలాపాలు విస్తరిస్తున్న హెల్త్‌ ఆన్‌ అజ్‌ టెక్నాలజీ
హైదరాబాద్‌, విశాఖల్లో ‘ట్రాన్సిషన్‌ కేర్‌’ కేంద్రాలు 

హైదరాబాద్‌: వివిధ రకాలైన వ్యాధులకు ఆసుపత్రులలో శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు చేయించుకొని ఇంటి దగ్గర కోలుకుంటున్న తరుణంలో రోగులకు అవసరమైన నర్సింగ్‌, ఫిజియో థెరపీ సేవలు అందించే సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. అదే హెల్త్‌ ఆన్‌ అజ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఇంటి దగ్గర కోలుకుంటున్న రోగులకు అవసరమైన నర్సింగ్‌, ఫిజియో థెరపీ సేవలను రోజులో ఏ సమయంలో అయినా అందిస్తామని సంస్థ ఛైర్మన్‌ లింగమనేని రమేశ్‌ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌, ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌’ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని, దాని ద్వారా అన్ని రకాల సేవలను బుక్‌ చేసుకోవచ్చని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు.  సాధారణ నర్సింగ్‌కు భిన్నంగా, శిక్షణ పొందిన సిబ్బందితో క్లినికల్‌ నర్సింగ్‌ సేవలను అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. బుక్‌ చేసుకున్నాక, సిబ్బంది ఎంత సమయంలోగా తమ ఇంటికి చేరతారన్నది కూడా యాప్‌లో ట్రాక్‌ చేసుకోవచ్చన్నారు.

భవిష్యత్‌లో విజయవాడ, తిరుపతి, బెంగళూరులోనూ..: ప్రధాన చికిత్సానంతరం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయిన వారికి అవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలుగా ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూ, వెంటిలేటర్‌ వసతులతో కూడిన ‘ట్రాన్సిషన్‌ కేర్‌’ కేంద్రాలను ఈ సంస్థ హైదరాబాద్‌, విశాఖపట్టణాల్లో ఏర్పాటు చేస్తోంది. ‘హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 28 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం ప్రారంభించాం. 20 పడకలతో విశాఖపట్నం కేంద్రం 3 నెలల్లో ప్రారంభమవుతుంది. వ్యాధిగ్రస్తుల ఇళ్లకు నర్సింగ్‌ సిబ్బంది త్వరగా వెళ్లేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శాటిలైట్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పూర్తిస్థాయి శిక్షణ పొందిన 100 మంది నర్సింగ్‌ సిబ్బంది, 75 మంది ఫిజియో థెరపిస్టులు, 50 మంది ఫార్మసిస్టులతో పాటు 85 మంది ఐటీ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలపై రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టాం. భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి, బెంగళూరుల్లోనూ ఈ కేంద్రాలు నెలకొల్పుతాం. రాబోయే మూడేళ్లలో ఇందుకు రూ.175 కోట్ల వరకు పెట్టుబడి అవసరమ’ని రమేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని