Russia-Ukraine: ఉక్రెయిన్‌ యుద్ధానికి నిధులు చమురుతోనే!

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై కాలుదువ్విన అనంతరం రష్యాకు నిధుల సమస్య వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో భారత్‌కు చమురును ఎగుమతి చేయడం ద్వారా రష్యా తన ఖజానాను నింపుకుని.. యుద్ధాన్ని కొనసాగించిందని యూరోపియన్‌ మేధో బృందం ఒకటి అంటోంది.

Updated : 25 Feb 2024 08:54 IST

భారత్‌ కొనుగోళ్లతో రష్యాపై ఆంక్షల ప్రభావం పడలేదు
మేధో సంఘం సీఆర్‌ఈఏ వ్యాఖ్యలు
ఐరోపా దేశాలే ఎక్కువ కొన్నాయన్న భారత్‌

ఉక్రెయిన్‌పై కాలుదువ్విన అనంతరం రష్యాకు (Russia) నిధుల సమస్య వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో భారత్‌కు చమురును ఎగుమతి చేయడం ద్వారా రష్యా తన ఖజానాను నింపుకుని.. యుద్ధాన్ని కొనసాగించిందని యూరోపియన్‌ మేధో బృందం ఒకటి అంటోంది. అయితే భారత్‌ నెల రోజుల్లో కొన్న చమురును కొన్ని ఐరోపా దేశాలు ఒక్కపూటలోనే కొన్నాయని మన దేశం గట్టి సమాధానం ఇచ్చింది.

క్రెయిన్‌ (Ukraine) యుద్ధానికి ముందు అంటే 2021-22లో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2 శాతం మాత్రమే. ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్లం.

యుద్ధం మొదలయ్యాక ఏమైంది?: ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై (Ukraine) దాడులు మొదలయ్యాక రష్యా తన చమురు ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇందుకు నేపథ్యం. దీంతో భారత్‌ తన చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోవడం కోసం రష్యా వైపు చూసింది. 2023లో చమురు దిగుమతుల్లో 30 శాతం దాకా రష్యా నుంచే భారత్‌ పొందింది. దీంతో ఏప్రిల్‌-డిసెంబరులో చమురు దిగుమతి బిల్లు 17% మేర తగ్గి 122.48 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. కానీ యూరోపియన్‌ మేధో బృందం మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

సీఆర్‌ఈఏ ఏమంటోందంటే..: రష్యా-ఉక్రెయిన్‌ (Ukraine Crisis) యుద్ధ సమయంలో భారత్‌ 37 బిలియన్‌ డాలర్ల మేర రష్యా చమురును కొని ఖజానాను నింపిందని ఫిన్లాండ్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌(సీఆర్‌ఈఏ) అంటోంది. ‘యుద్ధం ముందుతో పోలిస్తే 13 రెట్ల మేర భారత్‌ కొనుగోళ్లు పెరిగాయి. దీంతో పాశ్చాత్య దేశాల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా మారి.. ఆంక్షల ప్రభావం లేకుండా చేసింది. ఇదంతా చట్టబద్ధమే. అంతే కాదు, రష్యా చమురు నుంచి వచ్చిన ఇంధనాల్లో మూడింట ఒక వంతు జి-7 దేశాలకు భారత్‌ ఎగుమతి చేసిందని, వీటి విలువ 6.65 బి.డాలర్లని తెలిపింది. (అమెరికాకే 1 బి.డాలర్ల మేర పంపింది.) ఇందులో ఎక్కువ భాగం (5.2 బి.డాలర్లు) రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్‌ రిఫైనరీ నుంచే వచ్చాయని తెలిపింది. ఈ విషయంపై ఆర్‌ఐఎల్‌ స్పందించలేదు.

రష్యా ‘షాడో రవాణా’ ఇలా..: భారత్‌కు రష్యా చమురు విక్రయాలపై ఎటువంటి ఆంక్షలూ లేవు. అయితే లాభాలను పెంచుకోవడం కోసం రష్యా ఒక వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా చమురు ట్యాంకర్ల ‘షాడో ఫ్లీట్‌’ను సిద్ధం చేసిందని ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ అంటోంది. దీని ద్వారా ఎవరికి పంపుతున్నారో.. ఎలా పంపుతున్నారో తెలియండా చేసిందట. ఉదాహరణకు ఒక భారీ ట్యాంకరు, మరొక చిన్న ట్యాంకరు ఒకదాని పక్కన ఒకటి చమురును రవాణా చేస్తాయి. ఒక దాని నుంచి మరొక దానికి చమురు బదిలీ అవుతూనే ఉంటుంది. దీంతో గమ్యస్థానం ఏమిటి? ఎక్కడి నుంచి చమురు వచ్చింది అన్నది తెలియడం సంక్లిష్టమవుతుంది. ఇందులో ఒక నౌక భారత్‌కు చెందిన కంపెనీదేనని.. ఇంకొకటి ఎవరో గుర్తుతెలియని వ్యక్తిదని సీఎన్‌ఎన్‌ చెబుతోంది. ఈ బదిలీల్లో కొన్ని ఒక్కోసారి చట్టబద్ధంగానే ఉన్నా.. ఆంక్షల బారిన పడకుండా తప్పించుకోవడానికే ఈ వ్యూహాన్ని పన్నినట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది.

కొన్ని నేరుగానే.. కానీ..: యుద్ధం అనంతరం భారత్‌ కొనుగోళ్లు భారీగా పెరిగాయని.. అందులో రష్యా ‘షాడో ఫ్లీట్‌’ ద్వారా జరిగిన లావాదేవీలూ ఉన్నాయని సీఆర్‌ఈఏ తన నివేదికలో పేర్కొంది. కానీ రష్యా, భారత్‌ మధ్య చమురు లావాదేవీల్లో కొన్ని నేరుగానే ఉన్నాయని సీఎన్‌ఎన్‌ అంటోంది. అంతర్జాతీయ షిప్పింగ్‌ కదలికలను గమనించిన అనంతరం.. గతేడాది రష్యా నుంచి భారత్‌కు 588 నౌకలు నేరుగానే వచ్చాయి. అయితే 200 ట్రిప్పులు మాత్రం షాడో ఫ్లీట్‌ ద్వారా భారత్‌కు వచ్చాయని చెబుతోంది. మొత్తం మీద భారత చమురు కొనుగోళ్ల వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై చమురు ఆంక్షల ప్రభావం బలహీనపడిందని.. 2023లో రష్యా ప్రభుత్వ ఆదాయాలు 320 బి.డాలర్ల మేర పెరిగాయని సీఎన్‌ఎన్‌ అంటోంది.


భారత్‌ ఏమంటోందంటే..

భారత్‌ వైపే వేలు ఎందుకు చూపిస్తారని.. తమ కంటే రష్యా చమురును అధికంగా దిగుమతి చేసుకునే ఐరోపా దేశాలూ ఉన్నాయని భారత్‌ అంటోంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోలు విషయంలో కేవలం తన హక్కులను మాత్రమే వినియోగించుకుందని.. ఎటువంటి ఆంక్షల ఉల్లంఘనలకు పాల్పడలేదని పలుమార్లు ఉద్ఘాటించింది. ‘రష్యాతో మా వాణిజ్యం ఐరోపా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. మేమూ మా ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తున్నామ’ని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ అప్పట్లోనే  స్పష్టం చేశారు. ఇటీవల ఓ అంతర్జాతీయ వేదికపైనా ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు