విస్తృత భాగస్వామ్యాలతో కొత్త ఔషధాలు

విస్తృత భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా కొత్త ఔషధాలను త్వరగా ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) జీవీ ప్రసాద్‌ తెలిపారు.

Published : 28 Feb 2024 02:04 IST

దేశీయ ఫార్మా కంపెనీలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ సూచన
రీసెర్చ్‌ హాస్పిటల్స్‌తో పరిశోధనలకు సహకారం
ఈనాడు, హైదరాబాద్‌

విస్తృత భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా కొత్త ఔషధాలను త్వరగా ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) జీవీ ప్రసాద్‌ తెలిపారు. మన ఫార్మా కంపెనీలు, విదేశీ భాగస్వామ్యాలపై దృష్టి సారించాలని కోరారు. ‘జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో మనం పైచేయి సాధించాం.. ఇక కొత్త ఔషధాల ఆవిష్కరణపై దృష్టి సారించాలి’ అని బయో ఆసియా 2024 సదస్సులో నిర్వహించిన చర్చాగోష్ఠిలో సూచించారు. పరిశోధనలకు భారీ వ్యయప్రయాసలు తప్పవని పేర్కొంటూ.. చక్కెర వ్యాధిని అదుపు చేసే మందులను ఆవిష్కరించడానికి 2 దశాబ్దాల క్రితం డాక్టర్‌ రెడ్డీస్‌ చేసిన కృషిని ప్రసాద్‌ వివరించారు. ‘దాదాపు 150 మిలియన్‌ డాలర్లు (ప్రస్తుత డాలర్‌ విలువ ప్రకారం సుమారు రూ.1250 కోట్లు) ఖర్చు చేశాం. కొన్ని ఔషధాలను రెండో దశ క్లినికల్‌ పరీక్షల స్థాయికి తీసుకెళ్లాం. ఇంకొన్ని పరిశోధనా ప్రాజెక్టులపై ఇతర సంస్థలకు లైసెన్సులు ఇచ్చాం. ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేశాం’ అని ఆయన వివరించారు. ఆ తర్వాత మందుల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, భాగస్వామ్యాల ద్వారా ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మనదేశంలో నైపుణ్యాలకు కొదవ లేదు, కానీ పరిశోధనలు చేపట్టేందుకు భారీగా నిధులు అవసరమవుతాయని, ఈ లభ్యత తక్కువని అన్నారాయన. చైనాలో మాదిరిగా రీసెర్చ్‌ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయడం దీనికి కొంత పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడంతో పాటు పెద్దఎత్తున ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలూ చేపట్టాలని తెలిపారు. మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ పరిశోధనను వేగవంతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు.

మంగళవారం ఇక్కడ ప్రారంభమైన బయో ఆసియా సదస్సులో భాగంగా పలు అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. ఇందులో ప్రముఖ ఫార్మా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈఓలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌
- క్రిస్టోఫర్‌ బోర్నర్‌, సీఈఓ, బ్రిస్టల్‌ మైయర్స్‌ స్క్విబ్‌

ఆవిష్కరణలన్నీ అమెరికా నుంచి వస్తాయని అనుకుంటారు. కానీ, ప్రపంచంలోని పలు ఆవిష్కరణల వెనుక భారత్‌ ఉన్న మాట వాస్తవం. సమస్యలకు విభిన్నంగా పరిష్కారాలను ఆలోచించే వ్యక్తుల నుంచే ఇవి వస్తాయి. ఏటా 20 లక్షల మందికి పైగా నిపుణులు భారత్‌ నుంచి వస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్‌ ఈ విషయంలో ఎంతో ముందుంది. కొవిడ్‌ సమయంలో దేశ వ్యాప్తంగా నిమిషానికి 14,000 మందికి పైగా టీకాలు వేసిన ఘనత భారత్‌ది. నిజానికి భారత్‌ హృదయం ఉన్న దేశం. హైదరాబాద్‌లో రూ.820 కోట్లతో కార్యాలయం ప్రారంభించాం. 2025 నాటికి అమెరికా తర్వాత ఇదే పెద్ద కార్యాలయం అవుతుంది. ఆవిష్కరణలకు ఇక్కడ ఉన్న అవకాశాలపై మాకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. క్యాన్సర్‌ చికిత్సలో సెల్‌ థెరపీ కొత్త సాంకేతికత. శరీరాన్నే ఔషధంగా మార్చే ఈ ప్రక్రియ అగ్రగామి కానుంది. క్యాన్సర్‌తో పోరాడే శరీర రోగ నిరోధక వ్యవస్థను (ఇమ్యునోథెరపీ) మరింత అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా శ్రమిస్తున్నారు. ఇందుకు కృత్రిమ మేధలాంటి సాంకేతికతలు ఉపకరిస్తాయి. ఒక వ్యక్తికి రక్త క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయితే, శరీరం నుంచి కణాలను తీసి, వాటిని రీ ఇంజినీరింగ్‌ చేయొచ్చు. ఇలా చేసిన కణాలను తిరిగి రోగిలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి క్యాన్సర్‌ కణాలపై దాడి చేసి చంపుతాయి. ఇది అధ్భుతమైన శాస్త్రీయ పురోగతి. తదుపరి ‘ఆటో ఇమ్యూన్‌’ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఈ వ్యాధి లక్షణాలను అంచనా వేసేందుకు, వేల మంది రోగులపై ఏఐ (కృత్రిమ మేధ) ఉపయోగిస్తున్నాం. హృద్రోగాన్ని ముందే పసిగట్టేందుకూ ఏఐ ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల మంది ఈసీజీ ఫలితాలను విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. జీవ ఔషధాల రంగంలో 100 సంవత్సరాలుగా ఎంతో పురోగతి చూస్తున్నాం. ఆధునిక టీకాల ఆవిష్కరణలతో 25 ఏళ్ల ఆయుర్దాయాన్ని పొందుతున్నాం. డిజిటల్‌ టెక్నాలజీ ఏకీకృతం చేస్తున్నందున వేగంగా మరో 25 ఏళ్ల ఆయుర్దాయాన్ని జోడించగలం.


వైద్య రంగానికి సాంకేతికత తోడు
- రాడ్‌ హాచ్‌మన్‌, ప్రెసిడెంట్‌, సీఈఓ, ప్రొవిడెన్స్‌

ఆరోగ్య రంగంలో సమాచారం, సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక చోట ఉన్న వైద్యుడు, ఎక్కడో ఉన్న రోగికి రోబోటిక్‌ శస్త్రచికిత్స చేసే రోజులు వచ్చాయి. భవిష్యత్తులో ఇది మరింత వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సంరక్షణ డిజిటలీకరణ చెందుతోంది. హైదరాబాద్‌లోని మా కార్యాలయం ఇందుకు తగిన మద్ధతునిస్తుంది. రోగుల నుంచి సమాచారం సేకరించేందుకు కృత్రిమ మేధ, బాట్‌లు ఉపయోగపడతాయి. దీనివల్ల వైద్యులు, నర్సుల మీద భారం తగ్గుతుంది. సంక్లిష్ట చికిత్సల కోసం ఇవి వైద్యులకూ సమాధానం ఇవ్వగలవు. ఆరోగ్య వ్యవస్థల ఏకీకరణ జరిగితే భవిష్యత్‌లో ఏ మహమ్మారినైనా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూ సైబర్‌ భద్రత ఉండాలి.

నిబంధనలు కఠినంగా ఉన్నాయి: కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే క్రమంలో, కఠిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు తమ కంపెనీ వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.


పరిశోధనలకు విశ్వవిద్యాలయాలు కేంద్రంగా మారాలి
డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔషధ పరిశోధనలకు యూనివర్సిటీలు కేంద్రస్థానంగా ఉన్నాయని, ఇటువంటి సానుకూలత మనదేశంలో కొరవడిందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. బయో ఆసియా 2024లో భాగంగా నిర్వహించిన సీఈఓ సదస్సులో ఆయన మాట్లాడారు. పదేళ్ల క్రితం వరకు ఔషధ పరిశోధనల్లో చైనా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ, విశ్వవిద్యాయాలు, ఆసుపత్రుల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా సత్వర అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. ఔషధ పరిశోధనలకు సంబంధించి కచ్చిత లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ మేరకు విద్యార్థులకు నిధులు సమకూర్చాలని సూచించారు. మందుల తయారీలో కీలక ముడిపదార్థాల సరఫరాకు సంబంధించి, రవాణా సమస్యలు అధికమైనందున, వ్యయాలు పెరుగుతున్నట్లు సతీష్‌రెడ్డి వివరించారు. రవాణా సమస్యలను అధిగమించగలిగితే ఔషధ పరిశోధన, ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందన్నారు.


అన్నీ ఒకేచోట కోరుతున్నారు

లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావ మాట్లాడుతూ, గతంలో మాదిరిగా ప్రాథమిక ముడిపదార్థాలు చైనా నుంచి, ఇంటర్మీడియేట్‌ ఔషధాలు మనదేశం నుంచి, ఏపీఐలను వేరే దేశం నుంచి కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఇష్టపడటం లేదని, అన్నీ ఒకే చోట లభిస్తే సరఫరా- రవాణా సమస్యలు తగ్గుతాయనే ఆలోచనే ఇందుకు కారణమని వివరించారు. ఔషధ, జీవ శాస్త్రాల పరిశ్రమకు మనదేశంలో నిపుణుల కొరత ఉన్నట్లు ఆయన వివరించారు. ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నప్పటికీ, అందులో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ నుంచే ఉంటున్నారని, జీవ శాస్త్రాల వైపు వస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువని తెలిపారు. మనదేశంలో ‘ప్రాసెస్‌ రీసెర్చ్‌’ అధికంగా ఉన్నప్పటికీ, ఔషధ పరిశోధన తగినంతగా లేదని వివరించారు. ఈ పరిస్థితి మారాలంటే విశ్వవిద్యాలయాలకు అధికంగా నిధులు కేటాయించి, వాటిని పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి అందుకు అనువైన వ్యవస్థలను ఆవిష్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని