సరికొత్త భారతానికి అంకురాలే వెన్నెముక

సరికొత్త భారతానికి అంకుర సంస్థలు వెన్నెముకగా నిలవగలవని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Published : 28 Feb 2024 02:06 IST

కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌
మార్చి 18-20 తేదీల్లో ‘మహాకుంభ్‌’

దిల్లీ: సరికొత్త భారతానికి అంకుర సంస్థలు వెన్నెముకగా నిలవగలవని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. 2047 కల్లా 35 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.2905 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మనదేశం ఎదిగే యత్నాల్లో, వచ్చే అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత్‌ ఇప్పటికే అంతర్జాతీయ శక్తిగా మారింది. అందుకు కారణం మనపై మనకున్న విశ్వాసం, సుపరిపాలన, వినూత్న ఆవిష్కరణల కొనసాగింపు. ఇది మన సమయమ’ని మంగళవారమిక్కడ జరిగిన స్టార్టప్‌ మహాకుంభ్‌ సదస్సు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగం కోసం కాదు.. ఉద్యోగ సృష్టి వైపు వెళ్లాలి..: వచ్చే నెల 18-20 తేదీల్లో మహాకుంభ్‌ పేరిట జరిగే సదస్సులో మన అంకురాలు సృష్టించిన విప్లవాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ‘అమృత్‌ కాల్‌’లో వినూత్నత, అంకురాల ఏర్పాటు దిశగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గోయల్‌ అన్నారు.

మహాకుంభ్‌ ఎందుకంటే..: అంకుర ప్రపంచానికి చాలా శక్తి ఉంది. కేవలం ఎనిమిదేళ్లలోపే 100కు పైగా యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువైన సంస్థ)లు వచ్చాయి. మరిన్ని ఆలోచనలు ఆ స్థాయికి చేరనున్నాయి. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ మారాం. మహాకుంభ్‌లో 57 రకాల రంగాలకు చెందిన అంకురాల ప్రదర్శన జరగనుంది. 10కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. అంకురాల వ్యవస్థాపకులు, పెట్టుబడుదార్లు, ఇంక్యుబేటర్లు.. ఇలా అందరినీ ఒకదగ్గరికి చేర్చడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని