సంక్షిప్త వార్తలు

వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ ఆదేశించింది.

Published : 29 Feb 2024 02:02 IST

కాగ్నిజెంట్‌ ఉద్యోగులూ కార్యాలయాలకే!

దిల్లీ: వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ ఆదేశించింది. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు కంపెనీకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి టీమ్‌ లీడర్లు నిర్ణయిస్తారని కాగ్నిజెంట్‌ సీఈఓ రవికుమార్‌ పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. ప్రాజెక్టులు, శిక్షణ, బృందాల వారీగా కలిసి పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇందులో 2,54,000 మంది భారత్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సహా పలు కంపెనీలు ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలకడానికి సంకేతాలివ్వగా.. తాజా ఆ జాబితాలో కాగ్నిజెంట్‌ చేరింది. పని సంస్కృతి మెరుగు పడుతుందని, సహ ఉద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల ఉత్పాదకత బాగుంటుందనే కారణాలను కంపెనీలు చూపిస్తున్నాయి.


ఇళ్ల ధరలు 20% పెరిగాయ్‌: క్రెడాయ్‌

దిల్లీ: గత రెండేళ్ల (2021-23)లో దేశంలోని అగ్రగామి 8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 20% పెరిగాయని స్థిరాస్తి సంస్థల సమాఖ్య క్రెడాయ్‌ తాజా నివేదిక తెలిపింది. నిర్మాణ వ్యయాలకు తోడు, గిరాకీ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. అగ్రగామి 8 నగరాల్లో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ ఎన్‌సీఆర్‌, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతం, పుణె ఉన్నాయి. స్థిరాస్తి కన్సల్టెంట్‌ కొలియర్స్‌, డేటా అనలిటిక్‌ సంస్థ లియాసెస్‌ ఫోరాస్‌లతో కలిసి క్రెడాయ్‌ ఈ నివేదికను వెలువరించింది. 2021 స్థాయులతో పోలిస్తే 2023లో దిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు, కోల్‌కతాలలో ఇళ్ల ధరలు సగటున 30% పెరిగాయని తెలిపింది.


డబ్ల్యూజీసీ భారత సీఈఓగా సచిన్‌ జైన్‌

ముంబయి: ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఇండియా ప్రాంతీయ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా సచిన్‌ జైన్‌ను నియమించింది. ఈ నియామకం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. డబ్ల్యూజీసీలోకి రావడానికి ముందు డీబీర్స్‌ ఇండియాలో జైన్‌ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. డీబీర్స్‌ ఇండియా ఎండీగా ఆయన భారత్‌, మధ్య ప్రాచ్య దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. రిటైల్‌ విపణి, ఆభరణాల పరిశ్రమలో సచిన్‌కు ఉన్న అనుభవం.. దేశీయ పసిడి పరిశ్రమపై వినియోగదార్ల నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూజీసీ గ్లోబల్‌ సీఈఓ డేవిడ్‌ టెయిట్‌ వెల్లడించారు. ప్రస్తుతం డబ్ల్యూజీసీ భారత సీఈఓగా ఉన్న సోమసుందరమ్‌, ఇకపై సలహాదారు హోదాలో పని చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని