దివాలా పిటిషన్లపై స్పందించండి

బైజూస్‌పై దాఖలైన రెండు వేర్వేరు దివాలా పిటిషన్లపై ఆ సంస్థ స్పందించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం తెలిపింది.

Published : 29 Feb 2024 02:03 IST

బైజూస్‌కు ఎన్‌సీఎల్‌టీ

బైజూస్‌పై దాఖలైన రెండు వేర్వేరు దివాలా పిటిషన్లపై ఆ సంస్థ స్పందించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం తెలిపింది. బైజూస్‌ అమెరికా అనుబంధ సంస్థ ఆల్ఫా ఇంక్‌కు 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్ల) టర్మ్‌ రుణాన్ని ఇచ్చిన సంస్థల ఏజెంట్‌ గ్లాస్‌ ట్రస్ట్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు వారాల్లోగా తన అభ్యంతరాలను తెలపాలని బైజూస్‌ మాతృసంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌కు ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. హామీ ఇచ్చిన రుణాన్ని ఎగవేసిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది.

బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా(బీసీసీఐ) కూడా తమకు రూ.158 కోట్ల బకాయిలను బైజూస్‌ చెల్లించలేదని బెంగళూరు ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌కు మరో కేసులో తెలిపింది. 2019లో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐతో జరిగిన ఒప్పందం విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కరోనా పరిణామాల అనంతరం గిరాకీ తగ్గడంతో బైజూస్‌ పలు బకాయిలను, ఉద్యోగుల వేతనాలను చెల్లించలేకపోవడం, ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించడం వంటి సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జనవరి 25న అమెరికా రుణదాతల బృందం భారత్‌లో దివాలా కోర్టులో తొలి పిటిషన్‌ దాఖలు చేసింది.

‘రైట్స్‌ ఇష్యూ తేదీని పొడిగించండి’

200 మిలియన్‌ డాలర్ల రైట్స్‌ ఇష్యూ ముగింపు తేదీని పొడిగించే అంశాన్ని పరిశీలించాలని బైజూస్‌కు ఎన్‌సీఎల్‌టీ తెలిపింది. తద్వారా పిటిషనర్ల హక్కులను కాపాడినట్లు అవుతుందని.. వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు అవుతుందని బుధవారం తన ఆదేశాల్లో పేర్కొంది. ‘ఇష్యూ ద్వారా కంపెనీ అందుకున్న నిధులను విడిగా ఒక ఎస్క్రో ఖాతాలో ఉంచాలి. కోర్టులో ఈ అంశం తేలేంత వరకు వాటిని ఉపసంహరించుకోవడానికి వీల్లేద’ని స్పష్టం చేసింది. కాగా, రైట్స్‌ ఇషూయ బుధవారమే ముగియనుందని ఇప్పటికే యాజమాన్యం సంకేతాలిచ్చింది. అయితే పిటిషనర్లు అందులో పాల్గొన్నారా లేదా అన్నది తెలియరాలేదు. తదుపరి విచారణ ఏప్రిల్‌ 4న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని