సునీల్‌ మిత్తల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ (66)కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌, భారత వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గాను బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ 3 చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌ పొందనున్నారు.

Published : 29 Feb 2024 02:05 IST

కింగ్‌ ఛార్లెస్‌ నుంచి ఈ పురస్కారం పొందనున్న తొలి భారతీయుడు

లండన్‌: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ (66)కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌, భారత వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గాను బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ 3 చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌ పొందనున్నారు. యూకే కేబినెట్‌ ఆఫీస్‌ ఆవిష్కరించిన ఈ గౌరవ బ్రిటిష్‌ పురస్కారాల జాబితాలో మిత్తల్‌కు మోస్ట్‌ ఎక్సెలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ కింద నైట్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌(కేబీఈ)ను ప్రకటించారు. కింగ్‌ ఛార్లెస్‌ నుంచి ఈ గౌరవాన్ని పొందనున్న తొలి భారతీయ పౌరుడు మిత్తలే. బ్రిటిష్‌ హై కమిషనర్‌ నిర్వహించే ఈ అవార్డుల ప్రదానోత్సవ తేదీని తర్వాత ప్రకటిస్తారు. ఆ సమయంలో అధికారికంగా మిత్తల్‌కు ఈ అరుదైన గౌరవాన్ని అందజేస్తారు.భారత్‌లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను 2007లో మిత్తల్‌ పొందారు.

అంతక్రితం వీరికి..: సాధారణంగా బ్రిటన్‌ పౌరులకు నైట్‌హుడ్‌ ఇస్తే వారి పేర్లకు ముందు సర్‌ లేదా డేమ్‌ హోదాను ఇస్తారు. బ్రిటిష్‌యేతర్లకు మాత్రం వారి పేర్ల ముందు కేబీఈ (మహిళలకైతే డీబీఈ)ని ఉంచుతారు. అంతక్రితం గౌరవ కేబీఈని రతన్‌ టాటా (2009), రవి శంకర్‌(2001), జెంషెడ్‌జీ ఇరానీ(1997)లకు దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌ 2 అందజేశారు.

‘ఇది అత్యంత గౌరవం’..మిత్తల్‌: ‘బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3 నుంచి దక్కిన ఈ గుర్తింపును అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. యూకే, భారత్‌ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఇవి మరింత బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దేశాన్ని ఆకర్షణీయ పెట్టబడి స్థానంగా మార్చడంలో శ్రద్ధ వహించిన యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని సునీల్‌ మిత్తల్‌ సంతోషం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో విశిష్ఠ సేవలందించిన విదేశీ పౌరులను ఈ పురస్కారం(కేబీఈ)తో గౌరవిస్తుంటారు.

బ్రిటన్‌తో అనుబంధమిదీ..: ఇటీవలే బ్రిటన్‌ ప్రభుత్వం, ఇతర పెట్టుబడిదార్లతో కలిసి వన్‌వెబ్‌ (ప్రస్తుతం యూటెల్‌శాట్‌)ను పునరుజ్జీవింపజేసి అంతర్జాతీయంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి మిత్తల్‌ కృషి చేస్తున్నారు. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నమోదై ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని