అక్టోబరు- డిసెంబరులో జీడీపీ వృద్ధి 6.7- 6.9%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) అక్టోబరు- డిసెంబరులో దేశ వృద్ధిరేటు 6.7- 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 29 Feb 2024 02:05 IST

జులై- సెప్టెంబరుతో పోలిస్తే నెమ్మదించొచ్చు: ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) అక్టోబరు- డిసెంబరులో దేశ వృద్ధిరేటు 6.7- 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. జులై- సెప్టెంబరు వృద్ధిరేటు 7.6% కంటే ఇది తక్కువే కావడం గమనార్హం. వ్యవసాయ రంగం పేలవ పనితీరు కనబర్చడమే ఇందుకు కారణంగా నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబరు- డిసెంబరు వృద్ధి రేటు 4.5 శాతంతో పోలిస్తే మాత్రం ఇది ఎక్కువే. ప్రభుత్వ కేటాయింపులు పెరగడం, తయారీ రంగం రాణించడం వల్ల జులై- సెప్టెంబరులో అంచనాలకు మించి 7.6% వృద్ధి రేటు నమోదైంది. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన హవా కొనసాగించింది. డిసెంబరు త్రైమాసికంలో 7% వృద్ధి లభించొచ్చని ఆర్‌బీఐ అంచనావేయగా, ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా అంతకన్నా తక్కువగా ఉంది.

వ్యవసాయ రంగం వల్లే..: మత్స్య రంగం మినహా మిగతా వ్యవసాయ విభాగాల పనితీరు బాగాలేనందునే ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడానికి కారణంగా నివేదిక పేర్కొంది. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. 2023-24కు ప్రధాన ఖరీఫ్‌ పంటల ఉత్పత్తి 148.5 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చు. 2022-23 (ఏప్రిల్‌- మార్చి)తో పోలిస్తే ఇది 4.6% తక్కువ అని నివేదిక వెల్లడించింది. కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన పనితీరును కనబర్చడం కలిసిరావచ్చని తెలిపింది. సుమారు 4,000 నమోదిత కంపెనీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. 2022-23 అక్టోబరు- డిసెంబరుతో పోలిస్తే 2023-24 అక్టోబరు- డిసెంబరులో కార్పొరేట్‌ కంపెనీల లాభాలు 30%, ఆదాయం 7% పెరిగాయని నివేదిక పేర్కొంది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా) మినహా 3000 నమోదిత కంపెనీల ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. మార్జిన్లు 12% నుంచి 14.95 శాతానికి పెరిగాయని వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా అవరోధాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని