రూ.6 లక్షల కోట్ల సంపద హాంఫట్‌

బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బుధవారం సూచీలు డీలాపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి.

Published : 29 Feb 2024 02:06 IST

సమీక్ష

బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బుధవారం సూచీలు డీలాపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్ల పతనంలో, రిలయన్స్‌ షేరు ఒక్కటే 185.59 పాయింట్ల నష్టాలకు కారణమైంది. ఈ షేరు రూ.61.40 తగ్గి, రూ.2909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22,000 పాయింట్ల దిగువకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 82.91 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.90% నష్టపోయి 82.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సూచీల నష్టాల నేపథ్యంలో.. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ బుధవారం ఒక్కరోజే రూ.6.02 లక్షల కోట్లు తగ్గి      రూ.385.97 లక్షల కోట్ల (4.71 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,162.82 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ, మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకదశలో 72,222.29 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.20 పాయింట్లు కోల్పోయి 21,951.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,915.85- 22,229.15 పాయింట్ల మధ్య కదలాడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 నష్టాలు నమోదుచేశాయి. పవర్‌గ్రిడ్‌ 4.43%, మారుతీ 3.06%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.93%, ఎం అండ్‌ ఎం 2.68%, విప్రో 2.68%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.49%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.37%, టాటా స్టీల్‌    2.36%, రిలయన్స్‌ 2.07% డీలాపడ్డాయి. హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 0.68% వరకు లాభపడ్డాయి.
  • ఆకట్టుకున్న జునిపర్‌ హోటల్స్‌: హయత్‌ బ్రాండ్‌ కింద హోటళ్లను నిర్వహిస్తున్న జునిపర్‌ హోటల్స్‌ షేరు ఇష్యూ ధర రూ.360తో పోలిస్తే బీఎస్‌ఈలో 0.33% నష్టంతో రూ.361.20 వద్ద షేరు ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని  10.36% లాభంతో రూ.397.30 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,840.02 కోట్లుగా నమోదైంది.
  • రూ.45,000 కోట్ల నిధుల సమీకరణ ప్రకటన మదుపర్లను మెప్పించకపోవడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు 13.99% క్షీణించి రూ.13.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10,806.71 కోట్లు తగ్గి రూ.66,447.95 కోట్లకు పరిమితమైంది.
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతుండటంతో, మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు మరో 4.99% కోల్పోయి రూ.406.15 వద్ద లోయర్‌ సర్క్యూట్‌కు పడిపోయింది.
  • ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ ఐపీఓ మార్చి 4న ప్రారంభమై 6న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా  రూ.270- 288 నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లకు ఒకలాట్‌ 50 షేర్లుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.423 కోట్లు సమీకరించనుంది.
  • ఎక్సికామ్‌ టెలీసిస్టమ్స్‌ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 27.76 రెట్ల స్పందన లభించింది.
  • ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలోని కంపెనీ సైట్‌లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఎమ్‌డీసీ వెల్లడించింది.
  • విమాన లీజుదారు సెలెస్టియల్‌ ఏవియేషన్‌తో రూ.250 కోట్ల వివాదాన్ని స్పైస్‌జెట్‌ సెటిల్‌ చేసుకుంది. మార్చి 1న ఇరు సంస్థలు అధికారికంగా వివాదాన్ని పరిష్కరించుకోనున్నాయి. సెటిల్‌మెంట్‌ గురించి ఎన్‌సీఎల్‌టీకి సమాచారం అందించాయి.
  • బ్రిటన్‌లో అతిపెద్ద విద్యుత్‌ వాహన బ్యాటరీ తయారీ కేంద్రాన్ని సోమర్‌సెట్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్‌ గ్లోబల్‌ బ్యాటరీ వ్యాపార విభాగం అగ్రతాస్‌ వెల్లడించింది.
  • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో జరిగిన షేర్ల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన కేసులో బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ సురేశ్‌ కుమార్‌ రెడ్డి, ఇతరులపై విధించిన నియంత్రణలను ఉపసంహరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిరాకరించింది. నమోదిత కంపెనీలు, దాని అనుబంధ సంస్థల్లో డైరెక్టర్‌ వంటి కీలక పదవులు చేపట్టకుండా సంబంధితులపై విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
  • ఆదిత్య బిర్లా వెంచర్స్‌, సిడ్బీల నుంచి 2 మిలియన్‌ డాలర్లు సమీకరించినట్లు అంతరిక్ష అంకుర సంస్థ దిగాంతర వెల్లడించింది. తద్వారా ఈ రంగంలోకి బిర్లా, సిడ్బీ అడుగుపెట్టినట్లు తెలిపింది.

మార్కెట్ల నష్టాలకు కారణాలివే..

  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలు మరింత ఆలస్యం కావొచ్చన్న అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కారణమయ్యాయి.
  • గత రెండు నెలల్లో దేశీయ మార్కెట్లు భారీగా దూసుకెళ్లడంతో షేర్ల విలువలు అధిక స్థాయులకు చేరాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మదుపర్లు అప్రమత్తత పాటించడానికి మొగ్గుచూపుతున్నారు.
  • చైనా స్థిరాస్తి సంక్షోభంతో ఆసియా మార్కెట్లు కుదేలవ్వగా.. ఈ ప్రభావంతో మిగతా అంతర్జాతీయ మార్కెట్లు అదే బాటలో నడిచాయి.
  • ఫిబ్రవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనుండటంతో, మదుపర్లు పొజిషన్లను ముగిస్తున్నారు. ఇది లాభాల స్వీకరణకు దారితీస్తోంది.
  • మార్కెట్‌ ఒడుదొడుకుల నుంచి చిన్న మదుపర్లను సంరక్షించాల్సిందిగా మ్యూచువల్‌ ఫండ్‌లను సెబీ ఆదేశించింది. దీంతో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ పథకాల్లో పెట్టుబడుల జోరు తగ్గొచ్చన్న భయాలు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని