హైదరాబాద్‌లో బిల్‌ గేట్స్‌

హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా.. ఈ కేందాన్ని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌  సందర్శించారు.

Published : 29 Feb 2024 02:06 IST

మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ సందర్శన
పాతికేళ్లుగా క్రియాశీలక పాత్ర
ఇకపై కృత్రిమ మేధ సాంకేతికతలో

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా.. ఈ కేందాన్ని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌  సందర్శించారు. మైక్రోసాఫ్ట్‌ ఐడీసీని 1998లో ప్రతిపాదించారు. పాతికేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా బిల్‌ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించడం, దానికి ఆయన స్పందించి మైక్రోసాఫ్ట్‌ ఐడీసీని ఏర్పాటు చేయడం తెలిసిందే. తదనంతరం ఈ కేంద్రం మైక్రోసాఫ్ట్‌ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రపంచ స్థాయి ఉత్పత్తులైన అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపైలెట్‌, కొన్ని కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్ల అభివృద్ధిలో హైదరాబాద్‌ కేంద్రం భాగస్వామి అయ్యింది. హైదరాబాద్‌ కేంద్రంలోని అత్యుత్తమ ఇంజనీర్లతో బిల్‌ గేట్స్‌ మాట్లాడారని, అది ఎంతో అద్భుత దృశ్యమని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు. కృత్రిమ మేధ (ఏఐ) భారతదేశానికి అతిపెద్ద అవకాశమనే బిల్‌ గేట్స్‌ అభిప్రాయాన్ని నిజం చేస్తూ.. ఏఐ ఆధారిత  క్లౌడ్‌, సెక్యూరిటీ, గేమింగ్‌ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం  ఐడీసీ కృషి చేస్తోందని రాజీవ్‌ తెలిపారు. ఇటీవల మన దేశంలో పర్యటించిన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ - సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఏఐ సాంకేతికతలో భారతదేశం కీలకం కాబోతోందని అభిప్రాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని