స్మాల్‌, మిడ్‌క్యాప్‌ పథకాల మదుపర్ల ప్రయోజనాలు పరిరక్షించండి

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఓ విధానాన్ని రూపొందించాల్సిందిగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు సెబీ సూచించింది.

Published : 01 Mar 2024 01:43 IST

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు సెబీ సూచన

దిల్లీ: స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఓ విధానాన్ని రూపొందించాల్సిందిగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు సెబీ సూచించింది. ఈ సమాచారాన్ని ఫండ్‌ సంస్థల ట్రస్టీలకు తెలియజేయాల్సిందిగా అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ)కి సమాచారం పంపింది. ఈ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులపై ఆంక్షలు విధించడం, పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్‌, మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు మార్గదర్శకాలు లాంటి చర్యలను కూడా సూచించింది. కొన్ని త్రైమాసికాలుగా స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాల్లోకి గణనీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మార్కెట్లో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగాల షేర్లు అతిగా పెరిగినట్లు కనిపిస్తుండటం, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ల్లోకి పెట్టుబడుల రాక కొనసాగుతుండటం వల్ల ఏఎంసీలకు చెందిన యూనిట్‌హోల్డర్‌ పరిరక్షణ కమిటీతో సంప్రదింపులు జరిపి, మదుపర్లందరి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ట్రస్టీలు ఓ విధానాన్ని తీసుకొని రావాల’ని సెబీ తెలిపింది. మదుపర్ల పరిరక్షణకు ఏఎంసీలు, ఫండ్‌ మేనేజర్లు సరైన, సత్వర చర్యలు చేపట్టాలని తెలిపింది. కొత్త విధానాన్ని 21 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ఫండ్‌ హౌస్‌లకు వెల్లడించింది.

2023 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మిడ్‌క్యాప్‌ విభాగంలోకి నికరంగా రూ.6,468 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా వరుసగా 12 త్రైమాసికాలుగా పెట్టుబడుల రాక కొనసాగినట్లయ్యింది. ఇదే త్రైమాసికంలో స్మాల్‌క్యాప్‌ విభాగంలోకి నికరంగా రూ.12,052 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక త్రైమాసికంలో ఈ విభాగంలోకి వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే కావడం గమనార్హం. ఈ విభాగంలోనూ వరుసగా 11 త్రైమాసికాలుగా పెట్టుబడులు కొనసాగడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు