ఒడుదొడుకుల్లో స్వల్ప లాభాలు

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. ఫిబ్రవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు ఇందుకు కారణమైంది.

Published : 01 Mar 2024 01:47 IST

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. ఫిబ్రవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు ఇందుకు కారణమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 82.89 వద్ద స్తబ్దుగా ముగిసింది.బ్యారెల్‌ ముడిచమురు  0.43% నష్టపోయి 83.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై లాభపడగా, మిగతావి నష్టపోయాయి. ఐరోపాసూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • సెన్సెక్స్‌ ఉదయం 72,220.57 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 72,730 వద్ద గరిష్ఠాన్ని,  72,099.32 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 195.42 పాయింట్ల లాభంతో  72,500.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.65 పాయింట్లు పెరిగి 21,982.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,860.65- 22,060.55 పాయింట్ల మధ్య కదలాడింది.
  • భారత్‌లో వాల్ట్‌ డిస్నీ మీడియా వ్యాపారాలతో విలీనం కానున్నట్లు ప్రకటించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.54% లాభపడి రూ.2,924.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో షేరు రూ.2,958 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19.78 లక్షల కోట్లుగా నమోదైంది.
  • జీపీటీ హెల్త్‌కేర్‌ షేరు, ఇష్యూ ధర రూ.186తో పోలిస్తే బీఎస్‌ఈలో 16.20% లాభంతో రూ.216.15 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.219.70 వద్ద గరిష్ఠాన్ని తాకినా, చివరకు 7.93% పెరిగి రూ.200.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,647.25 కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 రాణించాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.81%, ఎం అండ్‌ ఎం 1.73%, నెస్లే      1.15%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.13%, పవర్‌గ్రిడ్‌ 1.07%, మారుతీ 1.06%, టైటన్‌     1.02%, అల్ట్రాటెక్‌ 1.01%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.01% లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ 0.73% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో సేవలు 1.46%, విద్యుత్‌ 1.01%, కమొడిటీస్‌ 0.79%, పరిశ్రమలు 0.74%, లోహ 0.74%, యంత్ర పరికరాలు 0.65% పెరిగాయి. బీఎస్‌ఈలో 1787 షేర్లు లాభపడగా, 2000 స్క్రిప్‌లు నష్టపోయాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • ప్రైమార్క్‌తో రిలయన్స్‌ చర్చలు: బ్రిటన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ సంస్థ ప్రైమార్క్‌ను మన దేశ విపణికి తీసుకొచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా టాటా జుడియో, మ్యాక్స్‌,  షాపర్స్‌స్టాప్‌ వంటి సంస్థలకు పోటీ ఇవ్వాలని రిలయన్స్‌ భావిస్తోంది. 55 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రైమార్క్‌ బ్రాండ్‌, దుస్తులు, షూలను మోస్తారు ధరలకు విక్రయిస్తుంది.
  • పేటీఎంలో మరో 2.17% వాటాను సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ గురువారం విక్రయించింది. దీంతో కంపెనీ వాటా 5.01% నుంచి 2.83 శాతానికి పరిమితమైంది. 2022 సెప్టెంబరుకు పేటీఎంలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 17.5% వాటా ఉండేది. తదుపరి వాటాను కొంతమొత్తంగా విక్రయిస్తూ వస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు బెర్క్‌షైర్‌ హాత్‌వే, అలీబాబా గ్రూప్‌లు పేటీఎం నుంచి నిష్క్రమించగా, యాంట్‌ ఫైనాన్షియల్‌ వాటాను తగ్గించుకుంది.
  • జింక్‌ ఆక్సైడ్‌ తయారీసంస్థ జేజీ కెమికల్స్‌ ఐపీఓ మార్చి 5న ప్రారంభమై 7న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.210- 221 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.251 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 67 షేర్లకు బిడ్లు దాఖలు చేసుకోవాలి.
  • కోర్ట్‌యార్డ్‌ బై మారియట్‌ హోటల్స్‌ను నిర్వహించే  ఆయుషి అండ్‌ పూనమ్‌ ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీలో భాగస్వామి వాటాను రూ.315 కోట్లకు కొనుగోలు చేసినట్లు చాలెట్‌ హోటల్స్‌ తెలిపింది. ఈ లావాదేవీ మార్చి 10 కి పూర్తయ్యే అవకాశం ఉంది.
  • తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ యూనిట్‌-2లో వాణిజ్య కార్యకలాపాలను శుక్రవారం  (మార్చి 1న) ప్రారంభించనున్నట్లు ఎన్‌టీపీసీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను నిర్మించారు.
  • ప్లాటినమ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి మొత్తం 98.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 96,32,988 షేర్లను ఆఫర్‌ చేయగా, 95,35,53,843 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల నుంచి 151 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 141.80 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 50.92 రెట్ల స్పందన వచ్చింది.
  • ఎక్సికామ్‌ టెలీసిస్టమ్స్‌ ఐపీఓకు మొత్తం 129.52 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా 1,82,23,540 షేర్లను జారీ చేయనుండగా, 2,36,03,94,900 షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. ఎన్‌ఐఐ విభాగంలో 153.20 రెట్లు, క్యూఐబీల నుంచి 121.80 రెట్లు, రిటైల్‌ విభాగంలో 119.51 రెట్ల స్పందన కనిపించింది.
  • 2023లో అదానీ గ్రూప్‌ ఎబిటా 34% వృద్ధి చెంది రూ.79,000 కోట్లుగా నమోదైంది. 2022లో గ్రూప్‌ ఎబిటా రూ.58,653 కోట్లుగా ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని