మూడో త్రైమాసికం.. భళా ఆర్థికం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది.

Published : 01 Mar 2024 01:53 IST

8.4 శాతానికి వృద్ధిరేటు
2023-24 వృద్ధి అంచనా 7.6 శాతానికి పెంపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవ్వడం, గనుల తవ్వకం, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. 2022-23 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో వృద్ధి రేటు 4.3 శాతమే కావడం గమనార్హం.

ఏ రంగం ఎలా..: సమీక్షా త్రైమాసికంలో తయారీ రంగం 11.6% వృద్ధి చెందింది. ఏడాది క్రితం ఇదే మూడు నెలల్లో 4.8% క్షీణించింది. ఇదే సమయంలో గనుల తవ్వక వృద్ధి రేటు 1.4% నుంచి 7.5 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం మాత్రం మార్పు లేకుండా 9.5% వృద్ధి రేటును కొనసాగించింది. వ్యవసాయ రంగ వృద్ధి 5.2% నుంచి 0.8 శాతానికి పరిమితమైంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా పెరిగింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. గురువారం విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో దీన్ని 7.6 శాతానికి పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.2 శాతమని గతంలో పేర్కొనగా, దీన్ని 7 శాతానికి తగ్గించింది.

  • 2023-24లో వాస్తవ జీడీపీ (2011-12 స్థిర ధరల వద్ద) రూ.172.90 లక్షల కోట్లుగా నమోదవుతుందని అంచనా వేసింది. 2022-23 తొలి ముందస్తు అంచనా రూ.160.71 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద మాత్రం 2023-24 ఏడాదికి జీడీపీ రూ.293.90 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. 2022-23లో ఇది   రూ.269.50 లక్షల కోట్లుగా ఉంది.
  • సమీక్షా త్రైమాసికం విషయానికొస్తే.. స్థిర ధరల వద్ద జీడీపీ రూ.43.72 లక్షల కోట్లుగా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. 2022-23 మూడో త్రైమాసికం నాటి రూ.40.35 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం.  ప్రస్తుత ధరల వద్ద చూస్తే రూ.68.58 లక్షల కోట్ల నుంచి 10.1% వృద్ధితో రూ.75.49 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపింది.
  • తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2021-22లో  రూ.1,50,906; 2022-23లో రూ.1,69,496గా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది.

దేశ సామర్థ్యానికి నిదర్శనం

తాజా జీడీపీ గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సామ ర్థ్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి. వేగవంత వృద్ధికి, 140 కోట్ల మంది భారతీయులు అత్యుత్తమ జీవనాన్ని గడిపేందుకు, ‘వికసిత భారత్‌’ను సృష్టించేందుకు ప్రభుత్వం తన చర్యలను కొనసాగిస్తుంది. 

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని