ప్లేస్టోర్‌లో యాప్‌ల తొలగింపు షురూ

సర్వీసు ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, భారత్‌లోని తన ప్లే స్టోర్‌ నుంచి కొన్ని యాప్‌లను తొలగించడాన్ని గూగుల్‌ ప్రారంభించింది.

Published : 02 Mar 2024 02:48 IST

సర్వీసు ఫీజు కట్టని వాటిపై గూగుల్‌ చర్యలు
జాబితాలో షాదీ, మాట్రిమోనీ, కుకు ఎఫ్‌ఎమ్‌, క్వాక్‌ క్వాక్‌!

దిల్లీ: సర్వీసు ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, భారత్‌లోని తన ప్లే స్టోర్‌ నుంచి కొన్ని యాప్‌లను తొలగించడాన్ని గూగుల్‌ ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. 10 కంపెనీలు ఫీజులను చెల్లించట్లేదని గూగుల్‌ పేర్కొంది. ఆ సంస్థల పేర్లు బయటకు వెల్లడించకపోయినప్పటికీ.. షాదీ, మాట్రిమోనీ, భారత్‌ మాట్రిమోనీ, బాలాజీ టెలీఫిల్మ్స్‌కు చెందిన ఆల్ట్‌ (అంతక్రితం ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్‌ఎమ్‌, డేటింగ్‌ యాప్‌ క్వాక్‌క్వాక్‌, ట్రూలీ మ్యాడ్లీ వంటివి తొలగింపునకు గురాయ్యయి. ఇవి ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. 15-30 శాతంగా ఉన్న ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆదేశాలు జారీ చేయడంతో గూగుల్‌ ప్రస్తుతం 11-26% ఫీజును వసూలు చేస్తోంది. వీటిపై సుప్రీం కోర్టు ఎటువంటి ఊరటా ఇవ్వకపోయినా.. కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని, వాటిపైనే చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ పేర్కొంది. ‘ఛార్జీలు వసూలు చేసుకునే గూగుల్‌ ప్లే స్టోర్‌ హక్కును ఏ కోర్టు కానీ, నియంత్రణ సంస్థ కానీ ఇప్పటిదాకా నిరాకరించలేదు. ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింద’ని గూగుల్‌ గుర్తు చేసింది.

‘ఇది చీకటి రోజు’: భారత ఇంటర్నెట్‌లో ఇది చీకటి రోజని భారత్‌ మాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్‌ జానకీరామన్‌ పేర్కొన్నారు. గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని కుకు ఎఫ్‌ఎమ్‌ సహ వ్యవస్థాపకుడు వినోద్‌ కుమార్‌ మీనా అన్నారు. క్వాక్‌క్వాక్‌ వ్యవస్థాపకుడు రవి మిత్తల్‌ మాత్రం నిబంధనలను పాటించి.. తిరిగి ప్లేస్టోర్‌లోకి వస్తామని వివరించారు. ‘భారత కంపెనీలు ప్రస్తుతానికి నిబంధనలు పాటిస్తాయి. అయితే మనకు యూపీఐ, ఓఎన్‌డీసీ తరహాలో ఒక యాప్‌ స్టోర్‌/ప్లే స్టోర్‌ ఉండాలి. ఒక వ్యూహాత్మక స్పందన అవసరమ’ని ఇన్ఫోఎడ్జ్‌ వ్యవస్థాపకుడు సంజీవ్‌ అంటున్నారు.

సుప్రీం కోర్టులో గూగుల్‌ ప్లే స్టోర్‌ను సవాలు చేస్తున్న కంపెనీల్లో మాట్రిమోనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అనాకడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ తదితరాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని