సంక్షిప్త వార్తలు

దేశ వ్యాప్తంగా రూ.1.62 లక్షల కోట్ల చమురు-గ్యాస్‌ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లా నుంచి ఆవిష్కరించారు.

Published : 03 Mar 2024 01:34 IST

రూ.1.62 లక్షల కోట్ల  చమురు-గ్యాస్‌ ప్రాజెక్టుల ఆవిష్కరణ

బిహార్‌: దేశ వ్యాప్తంగా రూ.1.62 లక్షల కోట్ల చమురు-గ్యాస్‌ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లా నుంచి ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులు బిహార్‌, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉన్నాయి. ‘వికసిత భారత్‌’ కార్యక్రమంలో భాగంగా బిహార్‌ను అభివృద్ధి చేయాలని తీర్మానించుకుని బెగుసరాయ్‌ జిల్లాకు వచ్చానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభావంతులైన యువత, బలమైన రైతులు, కార్మికులు ఉన్నారని కితాబిచ్చారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఇప్పుడు ఆవిష్కరించిన ఈ చమురు-గ్యాస్‌ ప్రాజెక్టులు కూడా దోహదం చేస్తాయని వివరించారు. 4 రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. బిహార్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, సీఎం నీతీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంలు సమ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఓఎన్‌జీసీకి చెందిన కేజీ బ్లాక్‌ కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2లో జనవరి నుంచి ముడి చమురు ఉత్పత్తి ప్రారంభం కాగా, తొలి ట్యాంకర్‌ ‘స్వర్ణ సింధు’ను శనివారం మోదీ జెండా ఊపి ప్రారంభించారని సంస్థ తెలిపింది. గరిష్ఠ సామర్థ్యం వద్ద ఈ ప్రాజెక్టు.. భారత చమురు-గ్యాస్‌ ఉత్పత్తికి 7 శాతం జత చేయగలదని పేర్కొంది.


విస్తరణ బాటలో ఏవెన్స్‌ ఇండియా

ఈనాడు, హైదరాబాద్‌: వాహనాలను అద్దెకు ఇచ్చే ఏవెన్స్‌ ఇండియా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం 44,000 వాహనాలను సిద్ధం చేసింది. దేశంలో 280కి పైగా ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యుత్‌ వాహనాలనూ అధికంగా వినియోగించనుంది. ఏవెన్స్‌ ఇండియా కంట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సువాజిత్‌ కర్మాకర్‌ మాట్లాడుతూ.. వాహనాలను అద్దెకిచ్చే సేవల రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు తెలిపారు. ఏఎల్‌డీ ఆటోమోటివ్‌, లీజ్‌ప్లాన్‌ ఇండియా కలిసి ఏవెన్స్‌ ఇండియాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు