Capgemini: క్యాప్‌ జెమినీలో భారీ నియామకాలు

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయంగా భారీ సంఖ్యలో నియామకాలు చేపడతామని క్యాప్‌ జెమినీ చీఫ్‌ టెక్నాలజీ, ఇన్నోవేటివ్‌ అధికారి నిషీధ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

Updated : 03 Mar 2024 08:15 IST

సీటీఓ నిషీధ్‌ శ్రీవాస్తవ వెల్లడి

ముంబయి: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయంగా భారీ సంఖ్యలో నియామకాలు చేపడతామని క్యాప్‌ జెమినీ చీఫ్‌ టెక్నాలజీ, ఇన్నోవేటివ్‌ అధికారి నిషీధ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. కంపెనీ దేశీయ వ్యాపారం మరింత పెరుగుతోందని, ఇందుకు తగినట్లుగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమ స్థాయిలోనే తమ ఉద్యోగుల సంఖ్య పెరుగుదల ఉంటుందని, 2023-24లో ఎదుర్కొన్న సవాళ్ల నుంచి ఐటీ రంగం పుంజుకోనుందని అన్నారు.

పరిశ్రమకు అవసరమైన పాఠాలు నేర్పాలి: దేశీయ ఐటీ పరిశ్రమ అవసరాలకు, సాంకేతిక విద్యలో నేర్పుతున్న పాఠ్యాంశాల మధ్య భారీ అంతరం ఉందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. పరిశ్రమ ప్రమాణాల్లో విద్యా సంస్థలు 1% కంటే తక్కువ అందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీని వల్లే చైనా, ఇజ్రాయెల్‌, రష్యా దేశాలతో వ్యత్యాసం వస్తోందని వివరించారు.

ఏఐతో ఉద్యోగాలు తగ్గవు: జనరేటివ్‌ కృత్రిమ మేధ(ఏఐ) వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. అన్ని వయసుల వారు కోడింగ్‌ నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఇది పెంచుతుందన్నారు. డేటా, మెషీన్‌ లెర్నింగ్‌, ఏఐ, అనలిటిక్స్‌ వంటి సాంకేతికతల్లో నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటే, ఉద్యోగం పొందడం తేలికవుతుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి భారత విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సులను వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయం 254 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.21 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం నాస్కామ్‌ అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి పరిశ్రమ కోలుకోవచ్చని పేర్కొంది. 2023-24 మొదటి మూడు త్రైమాసికాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో ఉద్యోగుల సంఖ్య మొత్తంగా 49,936 మేర తగ్గింది. ఖాతాదారులు వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో, ఐటీ కంపెనీలు కూడా నియామకాలపై అప్రమత్తత పాటిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని