యాప్‌ల తొలగింపును తీవ్రంగా పరిగణిస్తున్నాం

ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ కొన్ని యాప్‌లను తొలగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Published : 03 Mar 2024 01:43 IST

 మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి

దిల్లీ: ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ కొన్ని యాప్‌లను తొలగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. భారత యాప్‌లను తొలగించేందుకు అనుమతి లేదని చెబుతూ.. వచ్చే వారంలో గూగుల్‌తో, తొలగించిన యాప్‌ల సంస్థలతోనూ సమావేశం నిర్వహిస్తామని పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు అంకురాలు ఎంతో కీలకం. ఆ సంస్థల భవితవ్యాన్ని ఏ పెద్ద సాంకేతిక సంస్థ నిర్ణయానికి వదిలేయలేమ’ని వివరించారు. సేవా రుసుం చెల్లింపుల వివాదం నేపథ్యంలో భారత్‌లో ప్రముఖ మ్యాట్రిమొనీ యాప్‌లు సహా కొన్ని యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అశ్విని వైష్ణవ్‌ పై విధమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పోటీతత్వాన్ని, అంకురాలను దెబ్బతీసేలా గూగుల్‌ ఆధిపత్యం సాగిస్తుండటంపై ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా గూగుల్‌ ప్రవర్తించడం ఆధిపత్య దుర్వినియోగం కిందకు వస్తుందా? రాదా? అనే అంశంపై ప్రభుత్వం, న్యాయ స్థానాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కొన్ని మళ్లీ వచ్చేశాయ్‌: యాప్‌ల తొలగింపునకు అనుమతి లేదంటూ భారత ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన కొన్ని ప్రముఖ భారతీయ యాప్‌లను గూగుల్‌ పునరుద్ధరణ చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో నౌకరి, 99ఎక్రాస్‌ లాంటివి ఉన్నాయి. అయితే కొన్ని యాప్‌ల సంస్థలు ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ నిబంధనలను పాటించడం వల్లే వాటిని గూగుల్‌ పునరుద్ధరణ చేసిందని, దీనికి ప్రభుత్వ హెచ్చరికలతో సంబంధం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని