మన విమానం ఆకర్షణీయం

మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Updated : 09 Mar 2024 07:04 IST

ప్రయాణికుల సంఖ్యలో శర వేగం
ఆదాయాలు, లాభాల్లో వృద్ధి
మౌలిక సదుపాయాలు విస్తరిస్తే ఇంకా మేలు
ఈనాడు, హైదరాబాద్‌:

మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ముందు దేశీయంగా ఏడాదికి దాదాపు 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా విమాన ప్రయాణాలు చేసినట్లు రేటింగ్‌, కన్సల్టెన్సీ సేవల సంస్థ ఇక్రా వివరించింది. మనదేశం నుంచి విదేశాలకు ప్రయాణాలు చేసిన వారి సంఖ్య కొవిడ్‌ ముందు ఏడాదికి 2.5 కోట్లు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ సంఖ్యకు దగ్గరగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 2.7 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. తద్వారా క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 7-12% వృద్ధి ఉంటుందని అంచనా. ఈ సానుకూలత వల్ల విమానయాన రంగంలోని  సంస్థల ఆదాయాలు, లాభాలు పెరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగి, విమాన సేవల సంస్థలు ఆకర్షణీయ ఆదాయాలు నమోదు చేస్తాయని ఇక్రా పేర్కొంది. విమాన ఇంజిన్ల సమస్య, విమాన ఇంధన ధర అధికంగా ఉండటం, సరఫరా వ్యవస్థ అంతరాయాలున్నా, దేశీయ విమానయాన రంగం దూసుకెళ్తోందని విశ్లేషించింది.

ప్రపంచ సగటు కంటే అధిక వృద్ధి

వచ్చే కొన్నేళ్ల పాటు ప్రపంచ సగటు కంటే భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి  ఎక్కువగా ఉంటుందని బోయింగ్‌, ఇటీవల పేర్కొంది. మనదేశ జనాభా ప్రస్తుతం 140 కోట్లకు దగ్గరగా ఉండగా, 2042 నాటికి 160 కోట్లకు చేరుతుందని అంచనా. అదే సమయంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య ప్రస్తుత 35 కోట్ల నుంచి 70 కోట్లకు పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకునే వారి సంఖ్య ఇప్పుడు 25 కోట్లు కాగా, 2042 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పెరగొచ్చు. దీంతో పాటు విమానాల ద్వారా సరకు రవాణాలోనూ భారీ అవకాశాలున్నట్లు విశ్లేషించింది. వచ్చే 20 ఏళ్లలో మనదేశంలో సరకు రవాణా విమానాల సంఖ్య 80కు పెరుగుతుందని బోయింగ్‌ అంచనా వేసింది.

భారతదేశం కేంద్ర స్థానం అవుతుంది

వచ్చే 15 ఏళ్లలో భారతదేశం విమాన పరిశ్రమకు కేంద్ర స్థానం అవుతుందని ఎయిర్‌బస్‌ భావిస్తోంది. సమీప భవిష్యత్తులో విమాన పరిశ్రమకు అధిక డిమాండ్‌ కలిగిన పెద్ద మార్కెట్‌ భారతదేశమే. ఈ పరిశ్రమకు కేంద్రస్థానంగా భారత్‌ మారుతుందనడంలో సందేహం లేదని  ఎయిర్‌బస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌ విమానాల కొనుగోలుకు గత ఏడాదిలో రెండు అతిపెద్ద ఆర్డర్లు లభించింది మనదేశం నుంచే కావడం గమనార్హం. ఎయిర్‌ఇండియా 470 విమానాల (250 ఎయిర్‌బస్‌, 220 బోయింగ్‌ విమానాలు)కు ఆర్డర్‌ ఇవ్వగా, ఇండిగో 500 విమానాలు (ఎయిర్‌బస్‌ ఏ320 నియో) ఆర్డర్‌ చేసింది.

విమానాశ్రయాల్లో సదుపాయాలు పెరగాలి

ప్రయాణికులు, సరకు రవాణా విభాగాల్లో అధిక వృద్ధి అంచనాలకు అనుగుణంగా విమానాశ్రయాల్లో, సంబంధిత ఇతర విభాగాల్లో సదుపాయాలను పెద్దఎత్తున విస్తరించాల్సి ఉందని ఎయిర్‌బస్‌ అభిప్రాయపడుతోంది. దేశీయ ప్రయాణికులు.. అంతర్జాతీయ విమాన సర్వీసుకు మారాలన్నా; విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు దేశీయ విమాన సర్వీసుకు మారడం మన విమానాశ్రయాల్లో ఎంతో ఇబ్బందితో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఈ ప్రక్రియను సరిదిద్దాల్సి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు మెరుగుపరచాల్సి ఉందని ఎయిర్‌బస్‌ పేర్కొంది. సింగపూర్‌, దుబాయ్‌, దోహ.. తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు డొమెస్టిక్‌ నుంచి ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసుకు మారడం ఎంతో సులువుగా ఉందని ఉదాహరణగా చూపుతోంది.
అక్కడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ మారినంత సులువుగా విమాన సర్వీసు మారే వీలుందని పేర్కొంది. ప్రయాణికులు బ్యాగేజీ మోయాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు తమ బ్యాగేజీ పోతుందనే భయం కానీ అక్కడ ఉండదు. ఆగ్నేయ ఆసియా దేశాలకు, పశ్చిమ ఆసియా/ ఐరోపా దేశాల మధ్య ‘ట్రాన్సిట్‌ హబ్‌’ గా మనదేశంలోని విమానాశ్రయాలు మారాలంటే, ఇటువంటి సదుపాయాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాల్సి ఉంది. దానివల్ల అంతర్జాతీయ విమానాలను, ప్రయాణికులను అధికంగా ఆకర్షించే అవకాశం ఏర్పడుతుంది.

కొత్త విమానాలు మరింత ఆలస్యం?

విమానాలు, ఇంజిన్‌ తయారీ సంస్థలకు సరఫరాల పరంగా ఎదురవుతున్న ఆటంకాల వల్ల, దేశీయ విమానయాన సంస్థలు ఆర్డరు ఇచ్చిన విమానాల డెలివరీ కొంత ఆలస్యం కావచ్చని ఇక్రా పేర్కొంది. దేశీయ విమానాయాన సంస్థలన్నీ కలిపి దాదాపు 1700 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఇందులో ఎయిరిండియా, ఆకాశ ఎయిర్‌, ఇండిగో ఆర్డర్లే 1120 విమానాలున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఇవి క్రమంగా డెలివరీ కావాల్సి ఉంది. అయితే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల్లో సమస్యలు ఎదుర్కొంటుండగా, ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ తన ఇంజిన్ల వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. దేశంలో కొన్ని విమానాలు వివిధ సమస్యల వల్ల కార్యకలాపాలు నిలిపేశాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొత్త విమానాల చేరిక కొంత ఆలస్యం కావచ్చన్నది ఇక్రా అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని