తక్షణ లాభాల కోసం ట్రేడింగ్‌ ఆందోళనకరం.. చిన్న మదుపర్ల తీరుపై సీఈఏ నాగేశ్వరన్‌

తక్షణ లాభాలు వస్తాయని ఆశపడుతూ, చిన్న మదుపర్లు ఫ్యూచర్స్‌, ఆప్షన్ల (ఎఫ్‌అండ్‌ఓ)లో ట్రేడింగ్‌ చేయడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.

Updated : 14 Mar 2024 07:41 IST

ముంబయి: తక్షణ లాభాలు వస్తాయని ఆశపడుతూ, చిన్న మదుపర్లు ఫ్యూచర్స్‌, ఆప్షన్ల (ఎఫ్‌అండ్‌ఓ)లో ట్రేడింగ్‌ చేయడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. ‘స్వల్పకాలిక ధోరణి’ అనేది ఆర్థికవ్యవస్థ వృద్ధిలో స్థిరత్వం, మూలధన ప్రవాహానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని ఎన్‌ఐఎస్‌ఎం, సెబీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు. అధిక నష్టభయంతో కూడిన ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో 90% వరకు నష్టపోతున్నారని సెబీ అధ్యయనం చెబుతున్నప్పటికీ.. ఈ విభాగంలో గణనీయ సంఖ్యలో లావాదేవీలు నమోదవుతుండటం విచారకరమని పేర్కొన్నారు. ట్రేడింగ్‌ వల్ల, ఎలాంటి ఫలితం వస్తుందనే ఆలోచన చిన్న మదుపర్లకు ఉండటం లేదనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని తెలిపారు.  మూలధన సముపార్జన, వృద్ధి లాంటి లక్ష్యాలను సాధించాలంటే.. దీర్ఘకాలిక దృక్పథంతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలని నియంత్రణ సంస్థలు సూచిస్తున్నా, పెడచెవిన పెడుతున్నారని వివరించారు. చిన్న మదుపర్లు తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిరేటు: 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. తద్వారా వరుసగా మూడో ఆర్థిక సంవత్సరమూ 7 శాతానికి మించి వృద్ధి రేటు నమోదైనట్లు అవుతుందని తెలిపారు. అధిక వృద్ధి రేటును సాధించే కార్యాచరణను దేశం నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది కీలకమని తెలిపారు. చైనా మూడు దశాబ్దాల పాటు రెండంకెల వృద్ధిలో కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వృద్ధి, మూలధనం అంచనాల విషయంలో విస్తృత ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన నిధులు అందించేందుకు బ్యాంకులు కూడా తగినంత మూలధనం కలిగే ఉండేలా చూడాలని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని