సంక్షిప్త వార్తలు(6)

జర్మనీలోని మ్యూనిచ్‌ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Updated : 28 Mar 2024 03:48 IST

డ్యూయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ జట్టు

ఈనాడు, హైదరాబాద్‌: జర్మనీలోని మ్యూనిచ్‌ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం 40 సీట్ల సామర్థ్యం గల ‘డి328 ఎకో రీజినల్‌ టర్బోప్రాప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ కు చెందిన రీయర్‌ ఫ్యూస్‌లేజ్‌ సెక్షన్‌ డిజైన్‌పై డ్యూయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలిసి  సైయెంట్‌ పనిచేస్తుంది. ‘డోర్నియర్‌ 328’ విమానాన్ని ఆధునీకరించి డి328 ఎకో విమానాన్ని ఆవిష్కరించారు. ప్రాంతీయ విమాన సేవలకు ఇది అనువైనదని, ఇంధన సామర్థ్యం ఎక్కవని చెబుతున్నారు. ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ విమానం డిజైన్‌లో మార్పులు చేసే ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్తికేయన్‌ నటరాజన్‌ వివరించారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న సైయెంట్‌తో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు డ్యూయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సీఈఓ డేవ్‌ జాక్సన్‌ అన్నారు.


మారుతీ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు

దిల్లీ: మారుతీ సుజుకీ తన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో పలు మార్పులు చేపట్టింది. మార్కెటింగ్‌, విక్రయాల విభాగ కొత్త అధిపతిగా పార్థో బెనర్జీని నియమించడానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఈ స్థానంలో ఉన్న శశాంక్‌ శ్రీవాస్తవ మెంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హోదాలోకి మారనున్నారు. ప్రస్తుతం సేవల విభాగానికి అధిపతిగా పార్థో వ్యవహరిస్తున్నారు. తరుణ్‌ అగర్వాల్‌ హెడ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ బాధ్యతలు చేపడతారు. ఈ స్థానంలో ఉన్న సీవీ రామన్‌ మెంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీగా చేరనున్నారు. అగర్వాల్‌ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, పవర్‌ట్రైన్‌ విభాగ అధిపతిగా ఉన్నారు. హెడ్‌ ఆఫ్‌ ప్రోడక్ట్‌ ప్లానింగ్‌ హోదాలో సందీప్‌ రైనాను, సేవల విభాగ అధిపతిగా రామ్‌ సురేశ్‌ ఆకెళ్లను నియమించారు. ప్రస్తుత హెచ్‌ఆర్‌, ఐటీ అధిపతి రాజేశ్‌ ఉప్పల్‌ను మెంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి బదిలీ చేశారు. హెడ్‌ ఆఫ్‌ ఐటీగా మనోజ్‌ గౌతమ్‌, హెచ్‌ఆర్‌ విభాగాధిపతిగా సలీల్‌ బి లాల్‌, కార్పొరేట్‌ ప్లానింగ్‌ విభాగాధిపతిగా సునీల్‌ కక్కర్‌, కార్పొరేట్‌ వ్యవహారాల విభాగ హెడ్‌గా రాహుల్‌ భర్తి, సప్లై చైన్‌ హెడ్‌గా దీపక్‌ థుక్రాల్‌ నియమితులయ్యారు. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నియామకాలకు ఆమోదం లభించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.


3-5 తేదీల్లో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

ముంబయి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల షెడ్యూల్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం వెల్లడించింది. 2024-25లో ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) తొలి సమావేశం ఏప్రిల్‌ 3-5 తేదీల్లో జరగనుంది. తదుపరి సమావేశం జూన్‌ 5-7 తేదీల్లో ఉంటుంది. ఆరుగురు సభ్యులు ఉండే ఎంపీసీ సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది. మూడో రోజు తొలి అర్ధ భాగంలో సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించడం ఆనవాయితీ. జూన్‌ తరవాత ఆగస్టు, అక్టోబరు, డిసెంబరు, 2025 ఫిబ్రవరిల్లో మరో 4 ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలు ఉండనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబరు చివరకు పూర్తి కాబోతోంది.

కీలక రేట్లను ఎంపీసీ చాలా సమావేశాల నుంచి మార్చడం లేదు. ఇటీవల ద్రవ్యోల్బణం కాస్త శాంతించడంతో, వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తదుపరి సమీక్షలో తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


వ్యక్తిగత వివరాలను ఇవ్వకండి ఫెడెక్స్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొరియర్‌లో పార్సిల్‌ వచ్చింది. దాన్ని సీజ్‌ చేశారని’ బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్న కొందరు వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారని, ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని ఫెడెక్స్‌ సూచించింది. పార్సిల్‌ డెలివరీకి సంబంధించి తాము ఎలాంటి వ్యక్తిగత వివరాలనూ కోరమని స్పష్టం చేసింది. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, మెయిల్స్‌, సంక్షిప్త సందేశాలకు స్పందించొద్దని కోరింది. ఇలాంటి సందర్భాల్లో స్థానిక పోలీసు స్టేషన్‌ లేదా సైబర్‌క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో క్లోవర్‌డెల్‌ 2.25% వాటా విక్రయం!

దిల్లీ: అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ సంస్థ క్లోవర్‌డెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో తనకున్న మొత్తం 2.25% వాటాను విక్రయించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్లాక్‌ డీల్స్‌ ద్వారా ఈ మొత్తం ఈక్విటీ వాటాను విక్రయించడం ద్వారా క్లోవర్‌డెల్‌ రూ.1,191.4 కోట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో షేరును రూ.75 కనీస ధరతో విక్రయించనుందని సమాచారం. బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు బుధవారం 0.1% లాభంతో రూ.77.81 వద్ద ముగిసింది.


రెనో నిస్సాన్‌ నుంచి 4 కొత్త కార్లు

చెన్నై: జపాన్‌కు చెందిన నిస్సాన్‌, ఫ్రాన్స్‌కు చెందిన రెనోల సంయుక్త సంస్థ అయిన రెనో నిస్సాన్‌ అలయన్స్‌ సమీప భవిష్యత్తులో 4 కొత్త కార్లను విడుదల చేయబోతున్నట్లు సంస్థ ఛైర్‌పర్సన్‌ జీన్‌-డామినిక్‌ సెనార్డ్‌ వెల్లడించారు. ప్రస్తుతం 5 రకాల కార్లను దేశంలో విక్రయిస్తున్నామని తెలిపారు. ఇందులో 2 నిస్సాన్‌ ప్లాట్‌ఫామ్‌ కింద, 3 కార్లను రెనో బ్యాడ్జ్‌తో అమ్ముతున్నట్లు వెల్లడించారు. దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి, ఈనెల 27కు 25 సంవత్సరాలు పూర్తయినందున వేడుకలు జరుపుకుంటున్నట్లు చెన్నై పర్యటనకు వచ్చిన సెనార్డ్‌ తెలిపారు. భారత్‌కు తాను రావడం ఇదే తొలిసారని, ఇక్కడ ఇప్పటి వరకు తమ సంస్థ 1.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14,760 కోట్ల) పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రై.లి. ప్లాంట్‌లో ఏడాదికి 27 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 12 లక్షల కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చెన్నై ప్లాంట్‌లో 2 షిఫ్ట్‌ల్లో రోజుకు 480 కార్ల ఉత్పత్తి జరుగుతోంది.

భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీల) విపణిని అర్థం చేసుకుంటున్నామని, ఈవీల విడుదలపై సంప్రదింపులు జరుపుతున్నామని రెనో గ్రూప్‌ సీఈఓ లుకా డె మియో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని