బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం

2024-25 ఏప్రిల్‌-సెప్టెంబరులో మార్కెట్‌ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.

Published : 28 Mar 2024 02:02 IST

అందులో రూ.12,000 కోట్ల హరిత బాండ్లు
2024-25 ప్రథమార్ధానికి ప్రభుత్వ ప్రణాళికలు

దిల్లీ: 2024-25 ఏప్రిల్‌-సెప్టెంబరులో మార్కెట్‌ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి, రెవెన్యూ లోటును పూడ్చే దిశగా ఈ ప్రయత్నాలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం తెలిపింది. 2024-25కు స్థూల మార్కెట్‌ రుణ అంచనాలు రూ.14.13 లక్షల కోట్లుగా ఉండగా.. తొలి 6 నెలలకు అందులో 53 శాతాన్ని లేదా రూ.7.5 లక్షల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ జరగనుంది. ఇందులో భాగంగా రూ.12,000 కోట్ల హరిత బాండ్ల(ఎస్‌జీబీ)నూ జారీ చేయనున్నారు. ‘మొత్తం 26 వారాల వేలాల ద్వారా రుణ సమీకరణ చేపట్టనున్న’ట్లు తెలిపింది. 3, 5, 7, 10, 15, 30, 40, 50 ఏళ్ల కాలావధి సెక్యూరిటీల రూపంలో నిధులు సమీకరించనున్నారు. మొత్తం రుణ సమీకరణలో ఆయా కాలపరిమితుల బాండ్ల వాటా 4.8%, 9.6%, 8.8%, 25.6%, 13.87%, 8.93%, 19.47%, 8.93% చొప్పున ఉంటుందని తెలిపింది. రూ.14.13 లక్షల కోట్ల రుణాలను డేటెడ్‌ సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా సమీకరించడానికి మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని