హైదరాబాద్‌ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ తాజా నివేదికలో తెలిపింది.

Published : 28 Mar 2024 02:03 IST

అనరాక్‌

దిల్లీ: దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ తాజా నివేదికలో తెలిపింది. రానున్న రోజుల్లో గిరాకీ ఇంకా అధికం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 7 నగరాల్లో మొత్తం 1,30,170 ఇళ్లు/ఫ్లాట్లు అమ్మడయ్యాయి. ఏడాది క్రితం ఈ సంఖ్య 1,13,775 మాత్రమే. ప్రస్తుత త్రైమాసికంలో నమోదైన అమ్మకాలు, గత పదేళ్లలోనే గరిష్ఠమని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. రూ.1.5 కోట్లు, అంతకు మించి ధర ఉన్న ఇళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు.

నగరాల వారీగా..: ముంబయిలో ఇళ్ల విక్రయాలు ఏడాది వ్యవధిలో 34,690 నుంచి 24% వృద్ధితో 42,920 కు చేరాయి. పుణేలో 19,920 నుంచి 15% వృద్ధితో 22,990కు, హైదరాబాద్‌లో 14,280 నుంచి 38% వృద్ధితో 19,660కు చేరాయి. బెంగళూరులో 15,660 నుంచి 14% వృద్ధితో 17,790కు చేరాయి. దేశ రాజధాని దిల్లీలో మాత్రం 17,160 నుంచి 9% తగ్గి 15,650కు, చెన్నైలో 5,880 నుంచి 6% తగ్గి 5,510 కు పరిమితమయ్యాయి. సొంతిల్లు సమకూర్చుకునే ధోరణితో పాటు పెట్టుబడిదారుల నుంచి గిరాకీ పెరగడంతో స్థిరాస్తి రంగంలో వృద్ధి నమోదైందని నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని