పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌!

బజాజ్‌ ఫైనాన్స్‌లో ఓ విభాగంగా ఉన్న బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌.. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Published : 28 Mar 2024 02:04 IST

దిల్లీ: బజాజ్‌ ఫైనాన్స్‌లో ఓ విభాగంగా ఉన్న బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌.. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీ తన విలువను సుమారు 9-10 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.75,000- 83,000 కోట్లు)గా అంచనా వేసుకుంటూ, అందుకనుగుణంగా వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ కోసం పలు దేశీయ, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులతో చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

రూ.7500 కోట్ల సమీకరణ లక్ష్యం?: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో ‘అప్పర్‌ లేయర్‌’ కింద గుర్తింపు పొందిన సంస్థలు.. వాటిని నోటిఫై చేసిన తేదీ నుంచి మూడేళ్లలోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాలన్నది ఆర్‌బీఐ నిబంధన. 16 ఎన్‌బీఎఫ్‌సీలతో అప్పర్‌లేయర్‌ జాబితాను ఆర్‌బీఐ  2022 సెప్టెంబరు 30న విడుదల చేసింది. ఇందులో బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో పాటు టాటా సన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టాటా కేపిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ లాంటివి ఉన్నాయి. ఈ ప్రకారంగా.. 2025 సెప్టెంబరు కల్లా ఎక్స్ఛేంజీలో బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌   నమోదు కావాల్సి ఉంది. అందువల్లే ఐపీఓ ప్రక్రియను కంపెనీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.7,500 కోట్ల (90 కోట్ల డాలర్ల) వరకు సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ విలువను దృష్టిలో ఉంచుకుని, ఐపీఓలో పరిమితంగానే వాటా విక్రయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఈ నిర్ణయం ఉండొచ్చు. రాబోయే కొన్ని వారాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల ఎంపిక పూర్తి కావొచ్చు. ఈ ఐపీఓ కార్యరూపం దాలిస్తే.. బజాజ్‌ గ్రూపు నుంచి చాలా కాలం తరవాత ఒక సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినట్లు అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని