రిలయన్స్‌.. బ్యాంకింగ్‌ షేర్లు రాణించాయ్‌

దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్‌, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్‌ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి.

Published : 28 Mar 2024 02:05 IST

సమీక్ష

దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్‌, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్‌ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు తగ్గి 83.33 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 0.96% నష్టంతో 85.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 72,692.16 పాయింట్ల వద్ద ప్రారంభమై ఆద్యంతం సానుకూలంగా కదలాడింది. ఒక దశలో 668.43 పాయింట్లు లాభపడి 73,138.73 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు   526.01 పాయింట్ల లాభంతో 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 118.95 పాయింట్ల లాభంతో 22,123.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,193.60-22,052.85 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  3.6%, మారుతీ సుజుకీ 2.16%, టైటన్‌ 1.65%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.63%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.23%, కోటక్‌ బ్యాంక్‌ 1.18% చొప్పున పెరిగాయి. విప్రో 1.57%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.02%, టీసీఎస్‌ 1.02% మేర తగ్గాయి.

రూ.20 లక్షల కోట్లు మించిన ఆర్‌ఐఎల్‌ విలువ

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లను అధిగమించింది. ఈ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 3.48% పెరిగి రూ.2983.75 వద్ద స్థిరపడగా, బీఎస్‌ఈలో 3.60% రాణించి రూ.2983.85 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.70,039.26 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరింది. ఇంట్రాడేలో ఆర్‌ఐఎల్‌ షేరు ఒక దశలో 4% వరకు పెరిగి రూ.2,999.90 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.
  • మారుతీ సుజుకీ మార్కెట్‌ విలువ ఇంట్రాడేలో   రూ.4 లక్షల కోట్లను అధిగమించింది. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఒక దశలో ఈ షేరు   3.82% పెరిగి  రూ.12,724.95 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసినప్పుడు, మార్కెట్‌ విలువ రూ.4,00,075.70 కోట్లకు చేరింది. చివరకు షేరు రూ.12,550 వద్ద ముగియడంతో మార్కెట్‌ విలువ రూ.3,94,575.23 కోట్లుగా నమోదైంది.
  • దిగ్గజ న్యాయ సంస్థ శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళదాస్‌ అండ్‌ కో మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పల్లవి ష్రాఫ్‌ ఏషియన్‌ పెయింట్స్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగేందుకు రెండోసారీ నిరాకరించారు.
  • స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్‌ క్రిజాక్‌ లిమిటెడ్‌ రూ.1,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
  • పీఎన్‌ గాడ్జిల్‌ జ్యువెలర్స్‌ రూ.1,100 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేసింది.
  • 2024 ఆఖరుకు సంయుక్తంగా 5,000 వాహన ఛార్జింగ్‌ స్టేషన్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌ జట్టు కట్టాయి.
  • అదానీ పవర్‌ నుంచి 1600 మెగావాట్ల థర్మల్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.4,000 కోట్ల ఆర్డర్‌ను భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) దక్కించుకుంది.
  • సీడీఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌)లో 7.18% వాటాను రూ.1,266 కోట్లకు స్టాండర్డ్‌ ఛార్టెర్డ్‌ బ్యాంక్‌ బుధవారం ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా విక్రయించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని