ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్‌

ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్‌ రోజున జరుగుతోంది.

Updated : 28 Mar 2024 03:14 IST

నేటి నుంచి టీ+0 సెటిల్‌మెంట్‌
దిల్లీ

ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్‌ రోజున జరుగుతోంది. ఈ పద్ధతిని మరింత మెరుగు పరచి.. కొనుగోలు/అమ్మకం లావాదేవీ జరిగిన రోజే సెటిల్‌ చేసే టీ+0 విధానాన్ని గురువారం (ఈనెల 28) నుంచి బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) అందుబాటులోకి తేనున్నాయి. తొలుత 25 కంపెనీల షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకే ఈ అవకాశాన్ని ఎక్స్ఛేంజీలు అందుబాటులోకి తెచ్చాయి. మిగిలిన కంపెనీల షేర్లకు టీ+1 సెటిల్‌మెంట్‌ అమలవుతుంది.

ప్రయోజనాలివీ: టీ+0 అంటే అదే రోజు సెటిల్‌మెంట్‌ వల్ల, మార్కెట్‌ కార్యకలాపాల వ్యయాలు, సమయం ఆదా అవుతాయి. మదుపర్ల నుంచి వసూలు చేసే రుసుముల్లో పారదర్శకత రావడంతో పాటు క్లియరింగ్‌ కార్పొరేషన్లలో నష్ట నియంత్రణ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఇది దోహదం చేయనుంది.

‘2024 మార్చి 28న పరిమిత సంఖ్యలో షేర్లకు టీ+0 సెటిల్‌మెంట్‌ను ప్రారంభించడం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా భారత ట్రేడింగ్‌ మౌలిక వసతులను మార్చడంలో కీలక అడుగు అవుతుంది. పటిష్ఠమైన, ముప్పు రహిత మార్కెట్‌ వ్యవస్థకు ఇది మార్గం చూపుతుంద’ని స్టాక్స్‌బాక్స్‌ సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు. సెబీ బోర్డు సంప్రదింపులు, అనుమతుల అనంతరం.. ఐచ్ఛిక పద్ధతిలో మార్చి 28 నుంచి టీ+0 ట్రేడ్‌ సెటిల్‌మెంట్‌ బీటా వెర్షన్‌ను ప్రారంభించేందుకు గతవారం సెబీ విధివిధానాలు జారీ చేసింది.


తొలిదశలో ఈ షేర్లు

తొలి దశలో టీ+0 సెటిల్‌మెంట్‌ అయ్యే షేర్ల వివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. అవి

1) బజాజ్‌ ఆటో 2) వేదాంతా 3) హిందాల్కో ఇండస్ట్రీస్‌, 4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5) ట్రెంట్‌ 6) టాటా కమ్యూనికేషన్స్‌ 7) నెస్లే ఇండియా 8) సిప్లా 9) ఎంఆర్‌ఎఫ్‌ 10) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, 11) బీపీసీఎల్‌ 12) ఓఎన్‌జీసీ 13) అంబుజా సిమెంట్స్‌ 14) అశోక్‌ లేలాండ్‌ 15) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 16) బిర్లా సాఫ్ట్‌ 17) కోఫోర్జ్‌ 18) దివీస్‌ లేబొరేటరీస్‌ 19) ఇండియన్‌ హోటల్స్‌ 20) ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 21) ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ 22) యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా 23) ఎన్‌ఎమ్‌డీసీ 24) సంవర్థన మదర్‌సన్‌ ఇంటర్నేషనల్‌ 25) పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ

ఐచ్ఛికంగానే: బీటా దశ కింద ఐచ్ఛికంగా మాత్రమే టీ+0 సెటిల్‌మెంట్‌ అమలవుతుంది. ఎంపిక చేసిన బ్రోకర్ల పరిధిలోని మదుపర్లు అందరూ దీనిని వినియోగించుకోవచ్చు. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రేడింగ్‌కు దీనిని అమలు చేస్తారు. సూచీని గణించడంలో, టీ+0 కింద సెటిల్‌ అయిన షేర్ల విలువలను పరిగణనలోకి తీసుకోరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని