అంబానీ, అదానీ తొలిసారి కలిశారు

సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి.

Published : 29 Mar 2024 01:14 IST

అదానీ పవర్‌ ప్రాజెక్టులో రిలయన్స్‌కు 26% వాటా

దిల్లీ: సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. ఈ నేపథ్యంలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. గౌతమ్‌ అదానీకి చెందిన ఒక విద్యుత్‌ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేయడం ఆశ్చర్య పరిచింది. అదానీ పవర్‌కు పూర్తి అనుబంధ కంపెనీ అయిన మహాన్‌ ఎనర్జెన్‌లో ఒక్కో షేరు రూ.10 ముఖ విలువ వద్ద మొత్తం 5 కోట్ల షేర్లను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల విద్యుత్‌ను సొంత అవసరాల కోసం సంస్థ వినియోగిస్తుంది. ఆ మేరకు 20 ఏళ్ల దీర్ఘకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)ను మహాన్‌తో రిలయన్స్‌ కుదుర్చుకుంది.

అంబానీకి చమురు-గ్యాస్‌ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసినా.. పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్‌డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు అదానీ హాజరయ్యారు కూడా.


లోహ రంగంలోకి అదానీ

రూ.10,000 కోట్ల కాపర్‌ ప్లాంట్‌ తొలి దశ ప్రారంభం

గుజరాత్‌లోని ముంద్రా వద్ద నిర్మితమైన కాపర్‌ ప్లాంటు తొలి దశను ప్రారంభించినట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ప్రపంచంలోనే ఒకే ప్రదేశంలో ఏర్పాటైన అతిపెద్ద కాపర్‌ ప్లాంటు ఇదేనని సంస్థ తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ కంపెనీ అయిన ‘కచ్‌ కాపర్‌’ 1.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,000 కోట్ల) కాపర్‌ రిఫైనరీలో తొలి దశను ప్రారంభించిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు తొలి బ్యాచ్‌ కాథోడ్‌లను సరఫరా చేసినట్లు తెలిపింది. మన దేశ దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్లాంటు ఉపకరిస్తుందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. తొలి దశలో ఏటా 0.5 మిలియన్‌ టన్నుల రిఫైన్డ్‌ కాపర్‌ను ఈ ప్లాంటు ఉత్పత్తి చేయనుంది. 2028-29 కల్లా పూర్తి స్థాయి(1 మిలియన్‌ టన్నుల) సామర్థ్యానికి చేరుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఈ ప్లాంటు వల్ల నేరుగా 2,000 మందికి, పరోక్షంగా 5000 మందికి ఉపాధి లభించనుంది.


అంబుజా సిమెంట్స్‌లో రూ.6,661 కోట్ల అదానీ పెట్టుబడులు

అంబుజా సిమెంట్స్‌లో అదానీ గ్రూప్‌ రూ.6,661 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా తన వాటాను 3.6% పెంచుకుని 66.7 శాతానికి చేర్చుకుంది. ఇందు కోసం ఒక్కో షేరు ధరను రూ.314.15 గా పరిగణించి, ప్రమోటరు సంస్థ హార్మోనియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 21.20 కోట్ల వారెంట్లను షేర్లుగా మార్చుకోవడానికి అంబుజా సిమెంట్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 2028 కల్లా సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మి. టన్నులకు చేర్చుకోవాలన్న ప్రణాళికలకు తాజా పరిణామం ఉపయోగపడగలదని అదానీ గ్రూప్‌ భావిస్తోంది. ఏసీసీ సహా అనుబంధ కంపెనీలను కలిపితే అంబుజా సిమెంట్స్‌కు ఏటా 77.4 మి. టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

రూ.19,700 కోట్ల రుణాలను ఒకే రుణంగా మార్చుకున్న అదానీ పవర్‌: కంపెనీకి చెందిన ఆరు ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ)లు తీసుకున్న మొత్తం రూ.19,700 కోట్ల వేర్వేరు స్వల్పకాల రుణాలను ఒక దీర్ఘకాల రుణంగా అదానీ పవర్‌ ఏకీకరించింది. ఈ సర్దుబాటు వల్ల వడ్డీ రేటు తగ్గడంతో పాటు ఏకరూప గడువు ఉంటుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని