వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా

వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్‌ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్‌ అంచనా వేసింది.

Published : 29 Mar 2024 01:16 IST

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్‌ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్‌ అంచనా వేసింది. ఈ 25 కంపెనీలకు దేశీయ ఫార్మా పరిశ్రమలో 60% వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలు 13- 14% వృద్ధి నమోదు చేశాయి. దీంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఫార్మా కంపెనీల ఆదాయ వృద్ధి తక్కువగానే ఉంటుందని ఇక్రా విశ్లేషించింది. అమెరికా, ఐరోపా మార్కెట్లలో అమ్మకాలు మందగించడం, ఇతర కారణాలు ఈ పరిస్థితికి కారణమవుతాయని పేర్కొంది. 2024-25లో దేశీయ మార్కెట్లో ఔషధ రంగ వృద్ధి 6- 8 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి మనదేశ ఫార్మా కంపెనీలకు ‘హెచ్చరిక లేఖలు’ అధికంగా జారీ కావడం, ఇతర ఆంక్షలు ఇందుకు కారణమని ఇక్రా లిమిటెడ్‌ అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ మైత్రి మాచర్ల ప్రస్తావించారు. ‘ఎర్ర సముద్రం’లో తలెత్తిన పరిస్థితులు కూడా ఫార్మా పరిశ్రమ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని