స్టాక్స్‌ లాభాలు బల్లే బల్లే

ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి.

Published : 29 Mar 2024 02:07 IST

2023-24లో రూ.128.77 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. విద్యుత్‌, వాహన, లోహ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.39 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.42% పెరిగి 86.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ లాభపడగా, టోక్యో, సియోల్‌ నష్టపోయాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,149.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 1194 పాయింట్లు లాభపడి, 74,190.31 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఆఖర్లో అమ్మకాలు రావడంతో, చివరకు 655.04 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.25 పాయింట్లు రాణించి 22,326.90 దగ్గర స్థిరపడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 దూసుకెళ్లాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.95%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.09%, ఎస్‌బీఐ 2.53%, ఎం అండ్‌ ఎం 2.26%, పవర్‌గ్రిడ్‌ 2.21%, నెస్లే 2.18%, టాటా స్టీల్‌ 2%, ఎల్‌ అండ్‌ టీ 1.83%, విప్రో 1.66%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  1.66% లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా 0.50% వరకు నష్టపోయాయి. 
  • స్టాక్‌ మార్కెట్‌లో తమ షేరు డీలిస్టింగ్‌కు 72% మంది వాటాదార్లు అనుకూలంగా ఓటేశారని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. డీలిస్టింగ్‌ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ విలీనం కానుంది. అయితే డీలిస్టింగ్‌ ప్రతిపాదనను మెజారిటీ రిటైల్‌ మదుపర్లు వ్యతిరేకించారు.
  • దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల కోసం 1400కు పైగా ఫాస్ట్‌ ఛార్జర్‌ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నుంచి అతిపెద్ద ఆర్డరు దక్కించుకున్నట్లు జెట్‌వెర్క్‌ ప్రకటించింది. 6,000 ఛార్జర్‌లకు ఐఓసీ టెండర్‌ విడుదల చేయగా, ఇందులో 40 సంస్థలు పాల్గొన్నాయి.
  • ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 86.57 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 43,40,100 షేర్లను ఆఫర్‌ చేయగా, 37,57,05,680 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ మదుపర్ల నుంచి 46.97 రెట్ల స్పందన నమోదైంది.
  • పన్నులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపిస్తూ, రూ.27 కోట్లకు జీఎస్‌టీ డిమాండ్‌ ఆదేశాలు అందినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. ఈ ఆదేశాలపై అప్పీలేట్‌ అథారిటీలో అప్పీలు చేయనున్నట్లు తెలిపింది.
  • అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో 100 శాతం ఈక్విటీ వాటాను రూ.2021 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువతో ఓఎన్‌జీసీకి విక్రయించేందుకు వాటాదార్ల అనుమతి లభించిందని పీటీసీ ఇండియా తెలిపింది.
  • విద్యుత్‌ సరఫరా, పంపిణీ, భూగర్భ మెట్రో రైల్‌ టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం నిమిత్తం రూ.2,071 కోట్ల ఆర్డర్లను తమ అనుబంధ సంస్థలు దక్కించుకున్నాయని కల్పతరు ప్రాజెక్ట్స్‌ ప్రకటించింది.
  • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఉన్న మొత్తం 2.25% వాటాను  రూ.1,195 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ విక్రయించింది.
  •  బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా 59.80 లక్షల శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్లను ప్రమోటర్‌ సంస్థ సన్లామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రూ.1,427 కోట్లకు విక్రయించింది. కంపెనీలో ఇది 1.6% వాటాకు సమానం.
  • టీ+0 సెటిల్‌మెంట్‌ బీటా వెర్షన్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు గురువారం ప్రారంభించాయి. ప్రస్తుతం 25 షేర్లలోనే ఈ సదుపాయం లభిస్తోంది. మొదటి రోజున రెండు ఎక్స్ఛేంజీల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
  • మార్కెట్‌ విలువ పరంగా అత్యంత విలువైన దేశీయ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.20.14 లక్షల కోట్లు) నిలిచింది. తర్వాతి స్థానాల్లో టీసీఎస్‌ (రూ.14.05 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.11 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (7.69 లక్షల కోట్లు), ఎయిర్‌టెల్‌ (రూ.6.99లక్షల కోట్లు) ఉన్నాయి.

2023-24లో సూచీలు ఇలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ 14,659.83 పాయింట్లు (24.85%) లాభపడగా, నిఫ్టీ 4,967.15 పాయింట్లు (28.61%) పెరిగింది. ఈ సమయంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని  నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.258.19 లక్షల కోట్ల నుంచి రూ.128.77 లక్షల కోట్లు పెరిగి రూ.386.97 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి 2న మదుపర్లు సంపద రికార్డు గరిష్ఠమైన రూ.394 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఈ ఏడాది మార్చి 7న 74,245 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.


నేడు మార్కెట్లకు సెలవు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు (శుక్రవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని