సంక్షిప్తవార్తలు(5)

2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం శని, ఆదివారాలు (ఈనెల 30, 31 తేదీల్లో) తమ కార్యాలయాలు పనిచేస్తాయని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వెల్లడించింది.

Updated : 30 Mar 2024 12:36 IST

నేడు, రేపు ఎల్‌ఐసీ ఆఫీసులు పనిచేస్తాయి

ఈనాడు, హైదరాబాద్‌: 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం శని, ఆదివారాలు (ఈనెల 30, 31 తేదీల్లో) తమ కార్యాలయాలు పనిచేస్తాయని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఈ నేపథ్యంలోనే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచనల  మేరకు.. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్‌ఐసీ వెల్లడించింది.


శుక్రవారం మార్కెట్లు పనిచేయలేదు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయలేదు. మనీ, బులియన్‌, కమొడిటీ మార్కెట్లకు కూడా సెలవే.


ట్రాక్టర్ల వ్యాపారం నుంచి ఫోర్స్‌ మోటార్స్‌ నిష్క్రమణ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు ట్రాక్టర్లు, అనుసంధాన వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమించనున్నట్లు ఫోర్స్‌ మోటార్స్‌ వెల్లడించింది. వ్యవసాయ ట్రాక్టర్ల తయారీ వ్యాపార విభాగాన్ని మూసివేయాలని శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించారు. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరంతోనే ఈ వ్యాపారం మూతపడనుంది. మొబిలిటీ ట్రాన్స్‌పోర్టేషన్‌, లాస్ట్‌-మైల్‌ మొబిలిటీ, వస్తు రవాణా, ప్రీమియం లగ్జరీ వాహనాలు, పౌర, రక్షణ రంగాలకు ప్రత్యేక వాహనాల రూపకల్పనపై దృష్టి సారించనున్నట్లు ఫోర్స్‌ మోటార్స్‌ తెలిపింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ట్రాక్టర్ల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.182.53 కోట్లుగా ఉంది.


ఏడాది చివరికి 700 టచ్‌ పాయింట్లు: కియా ఇండియా

దిల్లీ: ఈ ఏడాది చివరి కల్లా దేశ వ్యాప్తంగా 300 నగరాల్లో 700 విక్రయ, సర్వీస్‌ టచ్‌పాయింట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు కియా ఇండియా తెలిపింది. సెల్టోస్‌, సోనెట్‌, కారెన్స్‌ తదితర మోడళ్లను విక్రయిస్తున్న కియా ప్రస్తుతం 236 నగరాల్లో 522 టచ్‌ పాయింట్లు నిర్వహిస్తోంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో మరింత బలోపేతం అవుతున్నట్లు పేర్కొంది. దాదాపు 40% టచ్‌పాయింట్లు ఈ నగరాల్లోనే ఉన్నాయని వెల్లడించింది. వీటితోపాటు 3-4 అంచె పట్టణాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. కియా 2.0 వ్యూహంలో భాగంగా టచ్‌పాయింట్ల సంఖ్యను వేగంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కియా ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు. పర్యావరణ హిత సర్వీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా డీలర్లను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. 2024 చివరికి సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ నెట్‌వర్క్‌ కేంద్రాల సంఖ్య 100కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి దేశ వ్యాప్తంగా 59 ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని