బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు తగ్గుతాయి

దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో  2.1 - 2.4 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది.

Updated : 30 Mar 2024 03:08 IST

2024-25లో 2.1 శాతానికి పరిమితం
కేర్‌ రేటింగ్స్‌ అంచనా

ముంబయి: దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో  2.1 - 2.4 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు 2.5-2.7 శాతంగా ఉన్నాయని శుక్రవారం సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. మొండిబాకీలను ఎన్‌పీఏలుగా పేర్కొనడంతో పాటు, వాటికి తగిన కేటాయింపులు చేసి, వాస్తవ విలువలను చూపించాల్సిందిగా ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. అధిక వడ్డీ రేట్లు, నియంత్రణల ప్రభావం, ద్రవ్య లభ్యత, వాతావరణం, అంతర్జాతీయ సమస్యలు బ్యాంకుల జీఎన్‌పీఏలపై ప్రభావం చూపొచ్చనీ విశ్లేషించింది. 2013-14లో బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.8% కాగా, 2015-16లో ఏక్యూఆర్‌ (ఆర్‌బీఐ ఆస్తుల నాణ్యతా పరిశీలన) కారణంగా 2017-18 నాటికి 11.2 శాతానికి చేరాయి. ఎన్‌పీఏలను గుర్తించడం, వాటిని పునర్‌వ్యవస్థీకరణ చేయడం లాంటివి చేపట్టడంతో చాలా బ్యాంకులు ఒత్తిడికి గురయ్యాయని పేర్కొంది. తదుపరి తీసుకున్న కఠిన చర్యల కారణంగా 2018-19 నుంచి జీఎన్‌పీలు తగ్గడం ప్రారంభించాయి. 2022-23 నాటికి దశాబ్ద కనిష్ఠ స్థాయి 3.9 శాతానికి దిగి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం చివరికి ఇవి 3 శాతం వద్ద ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రంగాల వారీగా చూస్తే..  2023 సెప్టెంబరు చివరకు వ్యవసాయ రంగంలో 7% జీఎన్‌పీలు ఉన్నాయి. పారిశ్రామిక రుణాల్లో 4.2%, రిటైల్‌ రుణాల్లో 1.3% జీఎన్‌పీఏలు ఉన్నాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని