మన స్టాక్‌ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లు

భారత స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపర్లు మక్కువ చూపుతూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన మార్కెట్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం.

Published : 30 Mar 2024 03:08 IST

2023-24లోనే ఇంత మొత్తం
దేశ ఆర్థిక ప్రగతిపై ఆశావహ దృక్పథం వల్లే

దిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపర్లు మక్కువ చూపుతూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన మార్కెట్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక మూలాలు బలంగా ఉండటం ఇందుకు కలిసొచ్చింది. డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా దాదాపు రూ.2.08 లక్షల కోట్లు, డెట్‌ మార్కెట్లలో రూ.1.2 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.3.4 లక్షల కోట్లు చొప్పించారు. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో.. 2021-22లో రూ.1.4 లక్షల కోట్లు, 2022-23లో రూ.37,632 కోట్ల పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారు. గతంలో చూస్తే 2020-21లో రికార్డులో స్థాయిలో రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు మన స్టాక్‌ మార్కెట్లలో పెట్టారు.

  • 2023-24 ఆర్థిక సంవత్సరం చూస్తే.. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్యలో ఎఫ్‌పీఐలు రూ.1.62 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. సెప్టెంబరు-అక్టోబరుల్లో రూ.39,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. మళ్లీ నవంబరు, డిసెంబరు నెలల్లో రూ.66,135 కోట్లు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా, మార్చిలో రూ.35,000 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంపైనా ఆశావహంగా ఉన్నా, అప్రమత్తతతో వ్యవహరిస్తారనే అంచనాలున్నాయి. దేశంలో సంస్కరణల అమలు కొనసాగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం వంటివి ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఆకర్షణకు కీలక అంశాలని  మజార్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ భరత్‌ ధావన్‌ అన్నారు. అంతర్జాతీయ భౌగోళిక అంశాల మేరకు పెట్టుబడుల్లో ఒడుదొడుకులు ఉంటాయని అంచనా వేశారు.
  • అమెరికా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరిస్థితులు కీలకం కానున్నాయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని