4 శాతం కంపెనీలే సంసిద్ధం

సైబర్‌ భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు దేశంలో 4 శాతం కంపెనీలు మాత్రమే సంసిద్ధంగా ఉన్నాయని సిస్కో నివేదిక పేర్కొంది.

Published : 31 Mar 2024 02:34 IST

సైబర్‌ భద్రతా ముప్పు ఎదుర్కోవడంపై సిస్కో నివేదిక

దిల్లీ: సైబర్‌ భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు దేశంలో 4 శాతం కంపెనీలు మాత్రమే సంసిద్ధంగా ఉన్నాయని సిస్కో నివేదిక పేర్కొంది. అయితే వచ్చే 12-24 నెలల్లో తమ వ్యాపారాలపై సైబర్‌ ముప్పుల ప్రభావం పడొచ్చని అధిక సంఖ్యలో సంస్థలు పేర్కొనడం గమనార్హం. ది 2024 సిస్కో సైబర్‌ సెక్యూరిటీ రెడీనెస్‌ ఇండెక్స్‌ను సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ముప్పులను ఎదుర్కొనేందుకు 4 శాతం సంస్థలు మాత్రమే సిద్ధంగా ఉండగా, 59 శాతం సంస్థలు ప్రారంభ దశల్లో ఉన్నాయని వెల్లడించింది. అంతర్జాతీయంగా ‘పరిణితి దశ’లో 3 శాతం కంపెనీలు ఉన్నాయని, దీని అర్థం సైబర్‌ భదత్రా ముప్పులను ఈ సంస్థలు ఎదుర్కోగలవని తెలిపింది. ఇటువంటి ముప్పులు అడ్డుకునేందుకు కంపెనీలు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని, అయితే మరీ నెమ్మదిగా వెళుతున్నట్లు వివరించింది. సంస్థల్లో సైబర్‌ భద్రత బాధ్యతలు నిర్వహిస్తున్న 8,136 ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. భారత్‌ నుంచి 1000 మందికి పైగా స్పందించారు.

  • వచ్చే 12-24 నెలల్లో తమ సంస్థలు సైబర్‌ ముప్పులు ఎదుర్కోవచ్చని 82% మంది అంచనా వేశారు. గత 12 నెలల్లో సైబర్‌ భద్రతా ఉల్లంఘనలను చవిచూశామని 74% మంది తెలిపారు. వీటి వల్ల కనీసం 3 లక్షల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని 55 శాతం మంది వెల్లడించారు.
  • సైబర్‌ ముప్పులను గుర్తించడం, స్పందించడం, కోలుకోవడం వంటి వాటిని మల్టిపుల్‌ పాయింట్‌ సొల్యూషన్స్‌ నెమ్మదించేలా చేస్తున్నాయి. సైబర్‌ ఇబ్బందులపై కంపెనీలకు అవగాహన ఉన్నప్పటికీ.. నైపుణ్యాల కొరత వాటిని ఇబ్బంది పెడుతోంది. 91 శాతం కంపెనీలు ఈ సమస్య ఉన్నట్లు తెలిపాయి.
  • వచ్చే 12-24 నెలల్లో ఐటీ మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్‌కు పెట్టుబడులు పెడుతున్నామని 71 శాతం సంస్థలు పేర్కొన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని